Machilipatnam Perni Nani: మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐపై మాజీ మంత్రి పేర్ని నాని దురుసుగా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది.   మెడికల్ కాలేజ్  వద్ద చేపట్టిన ధర్నా కేసుల విచారణలో వైసీపీ కార్యకర్తలను అకారణంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నపై కేసు నమోదు అయింది. విచారణ కోసం ఆయనను పిలిపించారు.  ఇది తెలిసిన పేర్ని నాని పోలీస్ స్టేషన్ కు వచ్చి వాగ్వాదానికి దిగారు.

Continues below advertisement

ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 19న మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భూముల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో 'చలో మెడికల్ కాలేజీ' అనే నిరసన కార్యక్రమం జరిగింది. పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.   మెడికల్ కాలేజీలోకి వెళ్లాలనుకున్న  నేతలను అడ్డుకున్నారు.  అనుమతి లేకుండా నిరసన చేపట్టడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి కారణాలతో మచిలీపట్నం పోలీసులు  వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. 

ఈ కేసు   విచారణలో భాగంగా వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. "మాట్లాడాలని" చెప్పి పిలిచినప్పటికీ, సుబ్బన్నను అక్కడే అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఆర్‌పేట ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. "కేసు విచారణలో భాగంగా రోజూ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని అని పేర్ని నాని ఆరోపించారు.       

Continues below advertisement

 పేర్ని నాని పోలీసులపై రెచ్చిపోయి, "తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అకారణ అరెస్టులు, వేధింపులు ఆపేయాలి. ఇలా కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవు" అని హెచ్చరించారు.  ఈ వీడియో వైరల్ అయింది. 

 "ధర్నా కేసు విచారణలో భాగంగా సాధారణ చర్యలు తీసుకుంటున్నాం. అరెస్ట్‌లు కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి" అని  పోలీసులు చెబుతున్నారు.   సెప్టెంబర్ 20న నమోదైన కేసులు   ప్రకారం, పోలీసులు కార్యకర్తలను విచారించడం కొనసాగుతోందని ప్రకటించారు.