TDP Leaders Happy over Vallabhaneni Vamsi Arrest |  గన్నవరం టిడిపి ఆఫీస్ లో పనిచేసే సత్యవర్ధన్ డిటిపి ఆపరేటర్ ను కిడ్నాప్ చేసి, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారనే కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఒక పక్క న్యాయ విచారణ జరుగుతుంటే.. మరో పక్కన టిడిపి శ్రేణులు అత్యంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నాయి. అతడేమీ ప్రత్యర్థి పార్టీ అధినేత కాదు. ఆగర్భ శత్రువు కాదు. కానీ వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రజల్లోనూ సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు వల్లభనేని వంశీపై  టిడిపి నుంచి ఇంతటి వ్యతిరేకత ఎదురవుతోంది అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

టీడీపీ నుంచి ఎంట్రీ.. పార్టీ అధినేత భార్యపై దుర్భాషలు ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన వల్లభనేని వంశీ తన స్నేహితుడు కొడాలి నాని ద్వారా ఎన్టీఆర్ కు సన్నిహితుడు అయ్యాడు. ఆయన రికమండేషన్తో 2009లో టీడీపీ నుండి విజయవాడ ఎంపీగా పోటీ చేశాడంటారు. కానీ అప్పటి కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయినా 2014లో గన్నవరం ఎమ్మెల్యే గా గెలిచారు. టీడీపీకి నమ్మకమైన లీడర్ గా పనిచేశారు. అయితే 2019 నాటికి ఆయన్లో మార్పు వచ్చింది. స్నేహితుడు కొడాలి నాని వైసీపీ లోకి వెళ్లడం, ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాలకు దూరం గా ఉండడంతో వంశీ కూడా పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది. పాదయాత్రలో ఉన్న వైసీపీ ఆఫీనేత జగన్ ను విష్ చేయడం టీడీపీలో సంచలనం సృష్టించింది. అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ నుండే గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ ప్రభావాన్ని తట్టుకుని కూడా  టిడిపి నుంచి గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. అదిగో అప్పటినుంచే ఆయనలో మార్పు వచ్చింది.

లోకల్ గా ఉండే టిడిపి నేతలతో గొడవపడడం.. మనకంటూ వర్గాన్ని మైంటైన్ చేయడం ఆయనపై పార్టీలో అనుమానాలను సృష్టించింది. మరోవైపు తనపై వస్తున్న వ్యతిరేక వార్తలకు లోకేష్ అనే అనుమానం వంశీలో మొదలైంది. దానితో జగన్ అభిమానిగా మారి టిడిపికి రాజీనామా లేఖ ఇచ్చి అసెంబ్లీలో వైసీపీకి మద్దతుదారుగా మారిపోయాడు. పోనీ అలా కొనసాగినా టిడిపి నుంచి ఇంతటి వ్యతిరేకత వచ్చేది కాదేమో. కానీ చంద్రబాబుపై విపరీతమైన దుర్భాషలతో విమర్శలు గుప్పించేవారు. ఇది పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేసింది. రాజకీయ జన్మనిచ్చిన పార్టీపై ఈ స్థాయిలో అంతకు ముందు ఎవరూ విమర్శలు చేయలేదు. రాజకీయాల్లో పార్టీని వేయడం పార్టీలో చేరడం అనేది సహజమే కానీ  వదిలి వచ్చిన పార్టీ అధినేతపై ఇంతటి వ్యక్తిగత స్థాయిలో తిట్లు, దుర్భాషలు గుప్పించింది వంశీ, కొడాలి నానినే అని టిడిపి శ్రేణులు ఇప్పటికీ అంటుంటాయి.

ఇక ఒకానొక దశలో అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై  వల్లభనేని వంశీ చేసిన ఆరోపణల గురించి నోటితో చెప్పలేని పరిస్థితి. ఏకంగా అసెంబ్లీ వేదిక గా జరిగిన ఆ సంఘటనలో వల్లభనేని వంశీ సహా, కొడాలి నాని, ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారని టిడిపి ఆరోపించింది. సుదీర్ఘ రాజకీయ అనుభం ఉన్న చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుని  ఏడ్చింది ఆరోజే. అసెంబ్లీని ఉద్దేశించి "ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ " అంటూ  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబుని ఆ విధంగా చూసి టిడిపి శ్రేణులే కాకుండా రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతి చెందింది.

అప్పటినుంచి టిడిపి శ్రేణులు కార్యకర్తల దృష్టిలో వల్లభనేని వంశీ ఒక శత్రువుగా మారిపోయారు. ఈలోపు గన్నవరం టిడిపి ఆఫీస్ పై 2023లో జరిగిన దాడిలో వల్లభ నేని వంశీ నిందితుడు గా కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అధికార పార్టీ మద్దతు ఉన్న ఎమ్మెల్యే కావడంతో ఆ కేసు పెద్దగా ముందుకదల్లేదు. కానీ ఏకంగా జన్మనిచ్చిన పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించిన ఆరోపణలు టిడిపి శ్రేణుల్లో వంశీపై ద్వేషాన్ని మరింత పెంచాయి. 

వల్లభనేని వంశీని వదిలేది లేదు : నారా లోకేష్

తన తల్లిని దూషించిన వంశీని వదిలేది లేదంటూ 2024 ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో  వైసీపీ తరఫున గన్నవరం నుండి పోటీ చేసిన వంశీ పరాజయం పాలయ్యారు. దాంతో వెంటనే వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని టిడిపి శ్రేణులు భావించాయి. ఈలోపు కేసు నుంచి తప్పించుకోవడానికి  గన్నవరం టిడిపి ఆఫీస్ లో డిటిపి ఆపరేటర్ గా పని చేసిన సత్య వర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేశారని కొత్త కేసు దాఖలైంది. 2023 నాటి గన్నవరం టిడిపి ఆఫీస్ ధ్వంసం కేసులో పిటిషన్ వేసింది ఈ సత్య వర్ధన్. ఆ పిటిషన్ వెనక్కు తీసుకోవాలని సత్య వర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించారని అందుకే అతను ఆ సంఘటనలో తనకు ఏమీ తెలియదని కోర్టు ముందు మాట మార్చాడు అనేది ప్రస్తుతం వంశీ పై దాఖలైన కొత్త కేసు. ఈ కేసులోనే వంశి అరెస్టు కావడంతో  గన్నవరంలో టిడిపి శ్రేణులు  సంబరాలు చేసుకున్నాయి.

Also Read: Vallabhaneni Vamsi Remand: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. చేజేతులా A1గా మారిన వైనం

తమ పార్టీ అధినేత సతీమణిని అసెంబ్లీ సాక్షిగా దుర్భాషలాడిన మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు కావడం తమకెంతో ఆనందం అని వాళ్ళు చెప్తున్నారు. గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు వల్లభనేని వంశీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పార్టీల పరిధులు దాటి వ్యక్తిగత స్థాయిలో వాళ్ళ మధ్య శత్రుత్వం నెలకొంది. దానితో ప్రత్యేకించి మరీ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు కార్యకర్తలతో కలిపి వంశీ అరెస్టు పట్ల సంబరాలు చేస్తున్నారు. వంశీ అరెస్టుతో టిడిపిలో ఇంతటి పండుగ వాతావరణం నెలకొనడానికి ఆయనపై ఆ పార్టీ శ్రేణుల్లో ఇంతటి కోపం కలగడానికి కేవలం వల్లభనేని వంశీ అడ్డు అదుపు లేని మాట తీరే కారణమని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు.