ఎయిర్ ఇండియా సంస్థ సిబ్బంది చేసిన ఓ తప్పిదం ప్రయాణికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. విజయవాడ విమానాశ్రయంలోనే ఈ ఘటన జరిగింది. నేటి నుంచి (మార్చి 29) విజయవాడ - కువైట్ కు వెళ్లే విమాన సర్వీసు ప్రారంభం అయింది. తొలిరోజే జరిగిన తప్పిదంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ పైన సమయం తప్పుగా ముద్రించడమే ఇందుకు కారణం అయింది. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు ఎయిర్ ఇండియా విమానాన్ని నడపనున్నారు. 


అయితే, షెడ్యూల్‌ ప్రకారం ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్‌ చేరుకోవాల్సి ఉంది. కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు తిరిగి విజయవాడ విమానాశ్రయానికి ఆ విమానం చేరుకోవాల్సి ఉంది. కానీ, తొలిరోజే ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతో 11 మందికి పైగా ప్రయాణికులు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.


ఎయిర్ ఇండియా చేసిన పొరపాటు ఏంటంటే.. విమానం ఉదయం 9.55కు బయల్దేరాల్సి ఉండగా.. ప్రయాణికులకు జారీ చేసిన టికెట్లలో మాత్రం మధ్యాహ్నం 1.10 గంటలకు అని ఇచ్చారు. ఆ ప్రకారమే గన్నవరం నుండి కువైట్‌కు 85 మంది ప్రయాణికులు టికెట్‌ బుక్ చేసుకున్నారు. విమానం బయల్దేరే సమయానికి 67 మంది ప్రయాణికులు మాత్రమే గన్నవరం చేరుకుని కువైట్ వెళ్లిపోయారు. టికెట్‌పై మధ్యాహ్నం 1.10 అని ఉండడంతో ఆలస్యంగా 11 మంది ప్రయాణికులు ఎయిర్‌ పోర్ట్‌కు వచ్చారు. మరికొంత మంది ప్రయాణికులు కూడా గన్నవరం చేరుకున్నారు. విమానం వెళ్లిపోవడంతో తికమక పడ్డ ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ సమయంలో కువైట్‌కు ఫ్లైట్ ఏమీ లేదని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. 


తమ టికెట్లను చూపించగా అందులో తప్పుడు టైం ముద్రించి ఉంది. ప్రయాణికులు గట్టిగా ప్రశ్నించడంతో డబ్బులు రీఫండ్‌ చేస్తామని సిబ్బంది చెప్పారు. అయినా తమ సమయం వేస్ట్ చేశారని ఎయిర్ ఇండియా సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.