Vijayawada Dussehra Navratri 2025: అక్టోబర్ 01 బుధవారంతో విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలు ముగుస్తున్నాయి. కృష్ణానది కి వరద పోటెత్తడం వల్ల ఏటా విజయదశమి రోజున జరిగే అమ్మవారి తెప్పోత్సవం రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.అమ్మవారి దర్శనానికి భవాని దీక్ష ధారులు అధికంగా తరలివస్తున్నందున గురువారం విఐపి, ప్రోటోకాల్ దర్శనాలను కూడా రద్దు చేశామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు.
మూలా నక్షత్రం రోజున నిర్వహించిన రీతిలోనే దసరా రోజున కూడాఅన్ని క్యూ లైన్ లలో ఉచిత దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు.
కృష్ణానదికి వరద ఉధృతి అధికంగా ఉన్నందున నదిలో అమ్మవారి తెప్పోత్సవం, జలవిహారం ఉండవన్నారు. అయితే శివాలయం నుంచి దుర్గా ఘాట్ వరకు ఊరేగింపుగా వెళ్లి శాస్త్రోక్తం గా జరపాల్సిన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
భక్తుల రద్దీ రీత్యా తెల్లవారుఝామున రెండు గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. దసరా రోజున క్యూలైన్లోని భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు.
*బుధవారం సాయంత్రానికి 62 లక్షల రూపాయల ఆదాయం*
దసరా ఉత్సవాలలో పదవ రోజు బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి పలు రకాల సేవల రూపేణా రూ. 62లక్షల 16వేల 970 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 15 రూపాయల లడ్డులు 12,847 విక్రయించగా 1,92,705 రూపాయలు , వందరూపాయల లడ్డు బాక్స్ లు 54,705 విక్రయించగా రూ.54,70,500 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా ముప్పైఆరు వేలు, ప్రత్యేక పరోక్ష చండిహోమం ద్వారా 24 వేలు, అదేవిధంగా ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 20,464 రూపాయలు ఫోటో& క్యాలెండర్ల విక్రయం ద్వారా 6,170 రూపాయలు, కేశఖండన ద్వారా రూ.4,58,720 ఇతరత్రా 8,411 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి 85,094 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు.చిన్నారులు తప్పిపోకుండా 5,042 ట్యాగ్ లు చిన్నపిల్లలకు వేశామన్నారు. 25,533 మందికి అన్న ప్రసాద వితరణ చేశామని, 17,29,057 లడ్డూలను లను విక్రయించినట్లు తెలిపారు.
తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు : సీయం చంద్రబాబు నాయుడు.
విజయదశమి సందర్బంగా తెలుగు ప్రజలకు ఏపీ సీయం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
" సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి. సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందివ్వాలి. అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు , పేదల సేవలో పెన్షన్లు, మహిళామతల్లులకు ఆసరాగా నిలిచే ‘దీపం’, ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’, బిడ్డలను విద్యావంతుల్ని చేసే ‘తల్లికి వందనం’ రైతుకు అండగా నిలిచే ‘అన్నదాత సుఖీభవ’, పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే ‘పీ4’ విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ... మరొక్క మారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు" అంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.