Chandra Babu: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఓ కొత్త కార్యక్రమం చేపట్టింది. స్వర్ణాంధ్ర@2047 పేరుతో ఓ సర్వే చేపట్టింది. మీ విజన్ - మా మిషన్.. కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మిద్దామంటూ ప్రజల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానిస్తోంది. దీనికోసం http://swarnandhra.ap.gov.in వెబ్ సైట్ లో ఓ లాగిన్ పేజ్ రూపొందించారు. మొబైల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే విజన్ డాక్యుమెంట్ లోకి నేరుగా ఎంటర్ అవుతాం. అక్కడ మిగతా వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 




స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత నేరుగా విజన్ డాక్యుమెంట్ పేజ్ తో లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన పేరు, ఫోన్ నెంబర్, జిల్లా, వయసు, వృత్తి, ఈమెయిల్.. తదితర వివరాలు అప్ లోడ్ చేసిన తర్వాత స్వర్ణాంధ్ర-2047 ప్రజాభిప్రాయ సేకరణ మొదలవుతుంది. 
1. 2047 నాటికి ఆంధ్రప్రదేశం కోసం విజన్
2.  ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు
3. జీవన ప్రమాణాల పెంపు
4. సుస్థిర, పర్యావరణానుకూల వృద్ధి
5. భవిష్యత్తు నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలు
6. పాలన మెరుగుపరచడం
7. మహిళా సాధికారత
8. రైతుల ఆకాంక్షలు
9. బలహీన వర్గాల ఆకాంక్షలు
10. భారత దేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర..


ఇలా ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను మనం నేరుగా అందులో పొందుపరచాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే కొన్ని ఆప్షన్లను ఇచ్చింది. ప్రతి ప్రశ్నకు ఆ ఆప్షన్లనుంచి మూడింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 


ఆయా ప్రశ్నలతోపాటు అదనపు సూచనలు ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు. దాని తర్వాత ఒక తీర్మానం ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంవైపు వెళ్లేందుకు నా వంతు క్రియాశీలక భూమిక పోషిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా తీర్మానం ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లో భాగస్వామ్యులం అయినట్టు. 



ఇక ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. సామాన్య ప్రజలతో ఈ విజన్ డాక్యుమెంట్ పూర్తి చేయించాలని, వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి కావడంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ విజన్ డాక్యుమెంట్స్ కూడా పూర్తి చేయిస్తున్నారు. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యాచరణ ప్రణాళికను ఇంటింటికీ చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో పాల్గొని సూచనలు ఇచ్చిన వారికి సీఎం చంద్రబాబు ఫొటో, సంతకంతో కూడిన డిజిటల్ సర్టిఫికెట్‌ ఇస్తారు. 


ఈ కార్యక్రమానికి సంబంధించి ఈనెల 27 నుంచి 29 వరకు స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా కలెక్టర్లు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రైతులు, వ్యాపారులు, ఇతర అసోసియేషన్ల ప్రతినిధులు.. అన్ని వర్గాల వారితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నాటికి మండల స్థాయిలో, అక్టోబరు 15 నాటికి జిల్లా స్థాయిలో.. స్వర్ణాంధ్ర 2047 విజన్ సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.


Also Read: స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదంటే కఠిన చర్యలు- మరో కీలక నిర్ణయం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు