Sharmila And Manikyam Tagore Lashed Out At YSRCP leaders : ఉమ్మడి రాజధాని పేరుతో వైసిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై  వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో గురువారం ఉదయం మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా..? అని షర్మిల ప్రశ్నించారు. 
అధికార పార్టీ నేతల చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? అని షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్ల అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రాజధాని లేదని, ప్రత్యేక హోదా రాలేదని, దేనికి కారణం ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం పూర్తి కాలేదని, జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేకుండా పోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమలు లేవని, ఉన్నవి ఉంటాయో, లేదో కూడా తెలియడం లేదన్నారు. 


అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత వైసిపిదే


రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని షర్మిల ఘాటుగా విమర్శించారు. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా, అభివృద్ధి చూపలేదని విమర్శించారు. ప్రధాని మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని షర్మిల ఆరోపించారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితిని ఈ రాష్ట్ర పాలకులు తీసుకువచ్చారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే, మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అని పిసిసి అధ్యక్షురాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను ప్రతి చోటా ఎండగడతామని స్పష్టం చేశారు. ఎన్నాళ్లు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని షర్మిల మండిపడ్డారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా, హైదరాబాదు రాజధాని అంశం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. వైసీపీకి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు షర్మిల.


వైసీపీ ఇసుక అక్రమ మైనింగ్ చేస్తోందంటూ మాణిక్యం ఠాగూర్ ఆరోపణ


అధికార వైసిపిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో మూడో మండల జోన్ ప్రెసిడెంట్ల సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన మాణిక్యం ఠాగూర్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందని కేంద్రం నివేదిక ఇచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వం.. జగన్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వందల కోట్ల లెక్కల్లో చూపని డబ్బు అక్రమ మైనింగ్ లో చేతులు మారుతున్నాయి మాణిక్యం ఠాగూర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నా.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం 16 సార్లు లోక్ సభ, రాజ్యసభల్లో మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికారని, పలు కీలక బిల్లులు ఆమోదం పొందడానికి జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని మాణిక్యం ఠాగూర్ ఆరోపించారు. భాజపాకు జగన్ ఎంపీల మద్దతు కావాలని, అయినా కూడా జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను అడగకుండా మోడీ ప్రభుత్వానికి బైండోవర్ అయ్యారని విమర్శించారు. జగన్ వ్యవహార శైలితో రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.