AP Elections 2024: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. అది ఆకతాయిల పని కాదని సజ్జల అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడారు. అంతకుముందు సజ్జల ప్రచార రథాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నారైలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చేయడం సంతోషంగా ఉందని సజ్జల అన్నారు. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వారు ముందుకొచ్చారని అన్నారు.
ఏపీలో ప్రస్తుతం ప్రజలు సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో తిరిగి సీఎం వైఎస్ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బోండా ఉమ లేదా అంతకంటే పెద్దవారు సీఎం జగన్ పై జరిగిన దాడి వెనక ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే అని.. ఇది ఆకతాయిల చర్య ఏ మాత్రం కాదని అన్నారు. సీఎం జగన్‌పై దాడి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితం అని కొట్టిపారేశారు. ఈ ఘటన వెనుక ఉన్నవారు బయటకు రావాలని అన్నారు. ఎవరినో ఈ కేసులో ఇరికించాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? విచారణలో తేలుతుందని అన్నారు. తప్పు చేసిన వాడు తనను ఇరికించారని మాట్లాడితే చెల్లుతుందా..? అని నిలదీశారు
అయితే, సీఎం వైఎస్ జగన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ కేసులో ఏ-1గా భావిస్తోన్న సతీష్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపర్చారు.