Heavy Flood In Prakasam Barrage: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి క్రమంలో పోలీసులు వంతెనపై రాకపోకలు నిలిపేశారు. దీంతో ప్రజలు, వాహనాలతో అక్కడ రద్దీ ఏర్పడింది. ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా.. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. అధికారులు మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 24.4 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. కాగా, వందేళ్లలో ఇది రెండో అతిపెద్ద వరద ప్రవాహంగా తెలుస్తోంది. 2009 అక్టోబర్ 5న 10,94,422 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే కృష్ణమ్మకు వరద పోటెత్తినట్లు పేర్కొంటున్నారు. అటు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రధాన రహదారిపై వరద పొంగుతుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి.


బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు


కృష్ణమ్మ ఉద్ధృతికి కొట్టుకొచ్చిన 3 బోట్లు బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదకు కొట్టుకొచ్చిన 3 బోట్లు బ్యారేజీ 3, 4 గేట్లను ఢీకొన్నాయి. గేట్ల నుంచి విడుదలవుతోన్న నీటికి ఇవి అడ్డంకిగా మారడంతో నీరు నిలిచిపోయింది. దాదాపు 40 కి.మీ వేగంతో వచ్చి బోట్లు ఢీకొనగా బ్యారేజీలోని ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతం దెబ్బతినడంతో అధికారులు మరమ్మతు చేసేందుకు సిద్ధమవుతున్నారు.




అటు, కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలంలో పునరావాస శిబిరానికి తీసుకొస్తోన్న బోటు వరద ఉద్ధృతికి గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 8 మంది ఉండగా.. గల్లంతైన ఆరుగురిని స్థానికులు కాపాడారు. మరో ఇద్దరి కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి.


శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లలో సమస్య


మరోవైపు, శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లలో సాంకేతిక సమస్య నెలకొంది. 2, 3 గేట్ల ప్యానల్‌లో బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. వరద ఉద్ధృతితో నీరు దిగువకు వదిలేందుకు గేట్ల హైట్ పెంచుతుండగా ఈ ఘటన జరిగింది. బ్రేక్ కాయిల్స్ పునరుద్ధరించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.


వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన గేదెలు


కృష్ణా నదికి వరద పోటెత్తడంతో సమీపంలోని లంక గ్రామాలు నీట మునిగాయి. రాయపూడి పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. దాదాపు 300 మంది గ్రామస్థులను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు. బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తుండగా.. వారిని హెలికాఫ్టర్ల ద్వారా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అటు, వరద ఉద్ధృతితో మంతెన సత్యనారాయణ ఆశ్రమం సమీపంలో కరకట్టకు ఉన్న గేటు వద్ద వరద నీరు లీక్ అవుతోంది. స్థానిక నేతలు, అధికారులు లీకేజీని అరికట్టేందుకు ఆదివారం తీవ్రంగా శ్రమించినా మళ్లీ లీకేజీ ప్రారంభం కాగా.. సోమవారం ఉదయం సీఆర్డీఏ అధికారులు లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు, తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామం పూర్తిగా జలదిగ్బంధమైంది. పంట పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.


Also Read: Heavy Rains: సరిహద్దు వద్ద తెగిన వంతెన - తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు