Mylavaram Assembly constituency: మైలవరం తెలుగు దేశం సీటు ఎవరికి దక్కుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పై సొంత పార్టిలోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్న క్రమంలో రోజుకో నాయకుడి పేరు నియోజకవర్గంలో హల్ చల్ చేస్తుంది.
మైలవరంలో గందరగోళం..
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అధికారికంగా కాని, అనధికారికంగా కానీ, ఆయా నియోజవకర్గాల్లో ఉన్న నేతలకు టిక్కెట్ ఇచ్చే విషయంలో అదినేత ఇప్పటికే క్లారిటి ఇస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం పై మాత్రం ఇప్పటికే సొంత పార్టి నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మైలవరం నియోజవర్గానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన అభ్యర్ది వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఐదేళ్ళ పాటు పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు కు ప్రస్తుతం సొంత పార్టిలోని నాయకులే షాక్ లు ఇస్తున్నారు.
ఉమాపై అసంతృప్తి ...
మంత్రి హోదాలో ఐదు సంవత్సరాల పాటు పని చేసిన దేవినేని ఉమాపై స్థానిక నాయకత్వం, క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా విజయం కోసం పని చేసిన నాయకత్వాన్ని ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా 2014 ఎన్నికల సమయంలో ఆర్దికంగా సహకరించిన అతి తక్కువ మంది నేతలను కూడ దేవినేని ఉమా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆ ప్రభావం 2019 ఎన్నికల సమయంలో చూపించారని అంటున్నారు. ఇక మంత్రిగా పని చేసిన సమయంలో పార్టి క్యాడర్ కు చిన్న చిన్న పనులు కూడ చేయకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరించారని, దేవినేని ఉమాపై నాయకులు అసహనంతో ఉన్నారు.
నియోజవకర్గంలో రోజుకో నేత పేరు ప్రచారం..
మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఉన్న అసంతృప్తి కారణంగా రోజుకొక నేత పేరు తెర మీదకు వస్తోంది. అంతే కాదు తెలుగుదేశం పార్టికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లోనే వాటిని ప్రచారం చేయటం విశేషం. మైలవరం నియోజకవర్గం కోసం టీడీపీలోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దేవభక్తుని సుబ్బారావు పేరు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్న గన్నే వెంకట నారాయణ ప్రసాద్, అలియాస్ అన్న పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పార్టిలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమాకు వ్యతిరేకంగా క్యాడర్, నియోజకవర్గ నేతలు అస్త్రాలను సిద్దం చేసుకుంటున్న సమయంలో ఈ వ్యవహరం పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికార పార్టీ నుంచి మైలవరం ఎమ్మెల్యే వసంత కూడ దేవినేని ఉమాను టార్గెట్ గా చేసుకొని రాజకీయం చేస్తున్నారు. అదికార పక్షం దూకుడు మీద ఉన్న క్రమంలో సొంత పార్టీలోనే నాయకులు దేవినేని ఉమాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటంపై ఆసక్తి నెలకొంది. ఓ వైపున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతకు అధిక సీట్లు కేటాయింపు అంశంపై పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి కీలక నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.