TDP Councillors Arrest: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరిగింది. టీడీపీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని మంగళవారం రోజు నిర్వహించింది. ఈ సమావేశంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా మాజీ సర్పంచ్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ కౌన్సిలర్ల ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు సమావేశంలో నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే సమావేశంలో ఘర్షణ వాతావారణం నెలకొంది. దీంతో కౌన్సిల్ సమావేశానికి ఆటంకం కల్గిస్తున్నారని నగర పాలక ఛైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీడీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమపై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారని టీడీపీ కౌన్సిలర్ల ఆరోపించారు. వైసీపీ పాలక పక్షం చర్యలను టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ తాతయ్య ఖండించారు. 


పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిలర్లు..


పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన తర్వాత కూడా టీడీపీ కౌన్సిలర్లు తమ నిరసనను కొనసాగించారు. స్టేషన్ కు తరలించిన తర్వాత టీడీపీ కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులు కౌన్సిల్ సమావేశంలోకి ప్రవేశించారని కౌన్సిలర్లు తెలిపారు. పోలీసులు కౌన్సిల్ సమావేశంలో వచ్చిన వీడియోలను న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. అన్యాయం జరుగుతోందమి ప్రశ్నించింనందుకు... తమపై దాడికి దిగారని ఆరోపించారు. న్యాయం జరిగిన వరకు పోరాడతామని తెలిపారు.


కౌన్సిల్ లో జరిగినదంతా ప్రజలు చూశారని అన్నారు. కౌన్సిల్ లో అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదని తెలిపారు. అంతేకాకుండా అడిగినందుకు ఇలా తమపై దాడులు చేస్తున్నారని వాపోయారు. సుందరీకణ పేరుతో ఎజెండా పెట్టి రాత్రులకు రాత్రులు విగ్రహాలు ఏర్పాటు చేయాడం ఏమిటని ప్రశ్నించారు.  ప్రైవేటు వ్యక్తుల విగ్రహాలను ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడం చట్ట ప్రకారం నేరమని తెలిపారు. అలాంటి పనులు ఎవరు చేసిన శిక్షార్హులనేనని అన్నారు.


ఏమైందో తెలియకుండానే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం


ప్రైవేటు వ్యక్తుల విగ్రహాలు ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయడం ఏమిటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మీమీ సొంత స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని, సర్కారు భూముల్లో ఎలాంటి విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని వెల్లడించారు. ఇదే విషయం గురించి ఛైర్ పర్సన్ ను అడిగితే.. జవాబు ఇవ్వలేక సతమతం అయ్యారని, కొందరు వైసీపీ కి చెందిన కౌన్సిలర్లు తమపై దాడి చేశారని వెల్లడించారు. అంతే కాకుండా తమపై దాడి చేశారని వాళ్లే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు. పోలీసు అధికారులు కూడా అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తమను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను వైసీపీ మానుకోకపోతే.. ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటామని తెలిపారు.