Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఏపీలోని విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఫ్లై91 అనే కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ప్రారంభించారు.

Flight Serivice between Vijayawada and Hyderabad | విజయవాడ: తెలుగు ప్రజలకు మరో శుభవార్త వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్ పోర్ట్) నుంచి హైదరాబాద్‌కు నూతన విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి వర్చువల్‌గా ఈ ఫ్లై91 (Fly91) సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకం ద్వారా ప్రాంతీయ అనుసంధానతను పెంచుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంస్థ విస్తరిస్తున్న తీరును ఆయన కొనియాడారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా మరిన్ని విమానాల రాకపోకలు పెరగనున్నాయని ఆయన వెల్లడించారు.
వేగంగా పలు విమానాశ్రయాల పనులు...
రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రః మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటనలు చేశారు. విజయవాడ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విజయవాడ నుంచి వారణాసి, కొచ్చి వంటి నగరాలతో పాటు దుబాయ్‌కు కూడా కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 17 నుంచి విమాన సర్వీసులు
గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన సేవల్ని ఫ్లై91 అందిస్తుంది. నేడు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు అందజేశారు. ఈ కొత్త సర్వీసు ప్రతిరోజూ ఉదయం 7:30 గంటలకు విజయవాడలో బయలుదేరి 8:40 గంటలకు హైదరాబాద్ (శంషాబాద్ ఎయిర్ పోర్ట్) చేరుకుంటుంది. ఏప్రిల్ 17 నుంచి విజయవాడ-హైదరాబాద్ మధ్య మరో అదనపు సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























