సీఎం నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఓ పులిని వదిలి, ముఖ్యమంత్రి జగన్ చేతికి కర్ర ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇటీవల తిరుమల మెట్ల గుండా వెళ్లే భక్తులకు కర్ర ఇచ్చి పంపిస్తుండడంపై నారా లోకేశ్ ఈ మేరకు స్పందించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. తన యువగళం పాదయాత్ర సజావుగా సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రే అవుతుందని నారా లోకేశ్ హెచ్చరించారు. యువగళం ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్ సీపీకి భయం పట్టుకుందని, తాను పాదయాత్ర చేస్తుంటే జగన్‌కు కాళ్లు నొప్పిపెడుతున్నాయని ఆయన తెలిపారు.


ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘చిత్తూరు చిందేసింది, అనంతపురం అదిరిపోయింది, కర్నూలు కదం తొక్కింది, కడప కేక పుట్టింది, నెల్లూరు నాటు దెబ్బ సూపర్, ప్రకాశంలో జన సునామి, గుంటూరు గర్జించింది, ఇప్పుడు కృష్ణా జనసంద్రంగా మారిపోయింది. ఈ జన సంద్రంలో జగన్ కొట్టుకుపోవడం ఖాయం. ఉద్యమాల వాడ బెజవాడ. అందరినీ చల్లగా చూసే దుర్గమ్మ ఆలయం ఉన్న పుణ్యభూమి కృష్ణా జిల్లా. మేరిమాత కొలువైన కొండ గుణదల. పాడిపంటలు, సిరులు అందించిన కృష్ణమ్మ పారే నేల కృష్ణా జిల్లా. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య ఈ భూమి పై పుట్టారు.


ఆ పిరికోడిని ఎక్కడా చూడలేదు - లోకేశ్


‘‘యువగళం.. మనగళం.. ప్రజాబలం. జగన్ పిరికోడు, జగన్ అంత పిరికోడిని నేను ఎక్కడా చూడలేదు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు మనం అడ్డుకోలేదు. సెక్యూరిటీ పెంచి పాదయాత్ర చేసుకోమని చెప్పాం. కానీ ఈ లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన వెంటనే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పోలీసుల్ని పంపాడు మనం తగ్గేదేలేదు అన్నాం. మైక్, వెహికల్ లాక్కున్నాడు. మా తాత ఎన్టీఆర్ గారి గొంతు ఇది. ఆపే మగాడు పుట్టలేదు, పుట్టడు. గుడ్లు, రాళ్లు వెయ్యమని పిల్ల సైకోలని పంపాడు. మన వాళ్లు ఆమ్లెట్ వేసి పంపారు.


ఇప్పుడు మళ్లీ ఫ్లెక్సీ కట్టనివ్వం, బ్యానర్లు చింపుతాం, సెక్యూరిటీ ఇవ్వం అంటున్నారు సన్నాసులు. బ్రదర్ జగన్ భయం నా బ్లడ్ లో లేదు. అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతాం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విశ్వ‌విఖ్యాత స్వర్గీయ ఎన్టీఆర్ గారు జన్మించిన గడ్డ కృష్ణా జిల్లా. ప్ర‌కాశం బ్యారేజీ గేట్ల‌న్నీ ఒకేసారి ఎత్తిన‌ట్టు.. యువ‌గ‌ళం జ‌న ప్ర‌వాహంలా పొంగింది. కృష్ణా జిల్లా మనవడిగా, అల్లుడిగా ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం’’ అని నారా లోకేశ్ మాట్లాడారు.


పిల్ల సైకోకి షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా - లోకేశ్


‘‘గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేం చేసిన తప్పు వలన ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు. ఈ పిల్ల సైకో మహా నటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సార్ సార్ అంటూ ఛాంబర్ కి వచ్చి నిలబడేవాడు. గౌరవంగా కూర్చోమన్నా నిలబడే ఉండేవాడు. ఈ పిల్ల సైకో పార్టీని వదిలిపెట్టి పోయాడు. 2012 సన్న బియ్యం సన్నాసి పోవడంతో సగం దరిద్రం పోయింది. ఇంకో సగం 2019 లో పిల్ల సైకో పోవడంతో పార్టీకి పట్టిన దరిద్రం పూర్తిగా పోయింది. ఈ పిల్ల సైకో పెద్ద తప్పు చేసాడు. దేవాలయం లాంటి గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టాడు. గెలిపించిన క్యాడర్ పైనే కేసులు పెట్టించాడు.


పార్టీ మారి పిల్ల సైకో పీకింది ఏమైనా ఉందా అంటే ఏమి లేదు. పెద్ద సైకోని ఆదర్శంగా తీసుకోని దోచుకుంటున్నాడు. పిల్ల సైకో నువ్వు భయంతో బతికే రోజులు దగ్గర్లో ఉన్నాయి. పిల్ల సైకో కి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ నేను ఇస్తా. గన్నవరంలో గెలిచేది టిడిపి నే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది టీడీపీనే. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా లో 14 సీట్లు వైసీపీకి ఇచ్చారు. జగన్ చేసింది ఏంటి చేతిలో చిప్ప పెట్టాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా లో 16 కి 16 సీట్లు టీడీపీకి ఇవ్వండి. మేం గెలిచిన వెంటనే చింతలపూడి ప్రాజెక్టును పూర్తిచేసి నాగార్జున సాగర్ కాలువల ద్వారా గోదావరి జలాలను తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గ సాగుకి అంద‌జేస్తాం’’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.