Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపుల కోసం కోసం పోటీ భారీగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 వైన్‌షాపుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాత్రి ఏడు గంటల వరకు 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి ఏడు గంటలతో గడువు ముగిసింది. అయినా రాత్రి 12 గంటల వరకు డిపాజిట్ డబ్బులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఎన్టీఆర్ జిల్లా టాప్
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల కారణంగా ప్రభుత్వానికి 1800 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎక్కువ దరఖాస్తులు ఎన్టీఆర్ జిల్లాలో వచ్చినట్టు సమాచారం. జిల్లాలో ఉన్న 113 షాపుల కోసం దాదాపు ఆరువేల వరకు అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
14 షాపుల లాటరీ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో ఎన్ని అర్హత ఉన్నాయో లేదో తెలుసుకుంటున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే వాటిని తర్వాత దశ ఫిల్టరేషన్ కోసం పంపిస్తారు. మిగతావాటిని తిరస్కరిస్తారు. అర్హత ఉన్న వాటిని 14వ తేదీన లాటరీ తీస్తారు. వాటి ద్వారా దుకాణం యజమానులను నిర్ణయిస్తారు.
ఐదేళ్ల తర్వాత తొలిసారిగా షాపులకు వేలం
ఆంధ్రప్రదేశ్‌లో 2019 తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన జగన్ సర్కారు ప్రభుత్వ వైన్‌షాపులను నిర్వహించింది. అందుకే గత ఐదేళ్లు ఎప్పుడూ మద్యం టెండర్లను పిలవలేదు. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా మద్యం దుకాణాల కోసం టెండర్లు పిలించింది. అందుకే వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. విదేశాల నుంచి కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చాయి. వీటిని దక్కించుకునేందుకు చాలామంది సిండికేట్ అయినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉండే నాయకులు తమ అనుచరులతో భారీ స్థాయిలో దరఖాస్తులు వేయించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం జోక్యంతోే దరఖాస్తుల వెల్లువ
కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేల, ఇతర సీనియర్ నేతలు జోక్యం కారణంగా మొదట్లో చాలా మందకొడిగానే దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద నేతలు కలుగుజేసుకున్నారని గ్రహించిన వ్యక్తులు అప్లికేషన్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీన్ని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.
ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పోటీ లేదని అంటున్నారు. ఈసారి అన్ని రకాల బ్రాండ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చీప్ లిక్కర్ 99 రూపాయలకే ఇస్తామని ప్రకటించింది. అన్నట్టుగానే చేస్తోంది.
కొత్త మద్యం పాలసీ 16 వ తేదీ నుంచి అమలు
ఈ నెల 14న ఆయా ప్రాంతాల్లో అధికారులు లాటరీ ద్వారా లిక్కర్ షాపుల యజమానులను నిర్ణయిస్తారు. తర్వాత రోజులు అంటే 15న ఆయా వ్యక్తులకు సర్టిఫికేట్లు అప్పగిస్తారు. 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభంకానున్నాయి. నూతన మద్యం విధానం అమలులోకి రానుంది.
Also Read: ఏకంగా పవన్ పేరుతోనే దందాలు చేస్తున్న కాకినాడ DFO - డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే !