తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్‌పై కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే పొలిటికల్ సైకో చంద్రబాబని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి ప్రజలు ప్రాణాలు తీసే వరకు చంద్రబాబు సైకోగానే ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


1861 పోలీస్ చట్టం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని... ఇక్కడ కూడా అమలులో ఉందన్నారు మంత్రి రోజా. వాస్తవాలను పట్టించుకోవడం మానేసిన టిడిపి, జనసేన పార్టీలు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాలకు 29 మంది చంపేశారని ఆరోపించారు. 


సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు చేస్తే టీడీపీ, జనసేన నేతలు బయట అడుగు పెట్టలేరని హెచ్చరించారు రోజా. 17 మంది ముఖ్యమంత్రులు ఏపిని పాలిస్తే అందరి కంటే మెరుగ్గా సీఎం జగన్ ఉన్నారన్నారు. ఒక ఎమ్మెల్యేను ఏడాదిపాటు బయటకు పంపించిన చంద్రబాబే సైకో అన్నారు. 23 మంది వై.సి.పి ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో నలుగురిని మంత్రులుగా చేసి ప్రజాస్వామ్యం అపహస్యం చేసిన సైకో చంద్రబాబు అన్నారు. 


కుప్పంలో చంద్రబాబు కుసాలు  కదులుతున్నాయని అందుకే రౌడీలా మాట్లాడుతున్నారన్నారు రోజా. కుప్పంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే ఎక్కువ అభివృద్ధి చేశారన్నారు. కుప్పంలో గల్లీ గల్లీ తిరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈడ్చి తన్నితే హైదరాబాద్‌లో పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు పేరు శవాల నాయుడుగా మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే పళ్లు రాలగొట్టి చేతిలో పెడతామని హెచ్చిరంచారు. 


మూడుసార్లు సీఎం అయిన ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని ఎద్దేవా చేశారు రోజా. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎక్స్ పోర్ట్ లో నెంబర్ వన్ గా ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు తామంతా తలదించుకుంటున్నామన్నారు. 


పవన్ కళ్యాణ్‌కు ఎమోషన్‌లు కూడా లేవని... ఒక ఆర్టిస్టుగా నేను సిగ్గు పడుతున్నామన్నారు రోజా. సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించారన్నారు. చంద్రబాబు తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ కట్టుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కష్టాల్లో ఉంటేనే పవన్ బయటకు వస్తారన్నారు. కందుకూరు ఘటనలో 8 మంది, గుంటూరులో 3 చనిపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయ సమాధి ప్రజలే కడతారన్నారు.