Krishna Crime News: బ్లాక్ మెయిల్ చేసి సోదరిపై పలుమార్లు అత్యాచారం, విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు
POCSO case | సోదరుడు అని సన్నిహితంగా ఉంటే ఫొటోలు తీసి, వాటితో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన యువకుడికి విజయవాడ పోక్సో కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించింది.

Vijayawada Crime News | విజయవాడ: కృష్ణా జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. సొంత చెల్లి అని కూడా చూడకుండా, ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడి చేయడంతో యువతి గర్భం దాల్చింది. కుటుంబసభ్యులకు తెలియకుండా ఆమె మెడలో తాళి కూడా కట్టి మోసం చేసిన కేసులో విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి మరణించే వరకు జీవితకాల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో వారు విడివిడిగా ఉంటున్నారు. దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి తన కుమారుడితో కలిసి కొండపి మండలం పెంట్లూరులో ఉంటున్నాడు. తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణా జిల్లా మంటాడలో నివాసం ఉంటున్నారు. 2023లో యువకుడు (21) తన తల్లి వద్దకు వెళ్తున్నానని చెప్పి మంటాడకు వచ్చాడు. అక్కడ తన పెద్ద చెల్లెలు (17)తో సన్నిహితంగా ఉన్నట్లు నటించి ఫొటోలు తీసుకున్నాడు. అవి చూపించి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించడంతో బాధితురాలు ఇంట్లో విషయం చెప్పలేదు.
సోదరి మెడలో తాళి కట్టిన నిందితుడు
2024 క్రిస్మస్ వేడుకల సమయంలో మంటాడకు వెళ్లిన నిందితుడు, తండ్రి వద్దకు తీసుకెళ్తానని నమ్మించి పెద్ద చెల్లిని విజయవాడకు తీసుకెళ్లాడు. అక్కడ చర్చిలో ఆమె మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తరువాత తల్లి కుమారుడికి ఫోన్ చేసి చెల్లిని తన వద్దకు పంపించాలని కోరింది. గత ఏడాది ఫిబ్రవరిలో నిందితుడు మైనర్ బాలికను ఒంగోలు బస్టాండులో వదిలేసి తండ్రితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు.
ఇంటికి చేరుకున్న బాలిక కొన్ని రోజులకు అస్వస్థతకు గురికావడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. కుమార్తెను ప్రశ్నించగా సోదరుడు తనపై చేసిన అఘాయిత్యాలను తల్లికి వివరించింది. తల్లి ఫిర్యాదుతో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ నిందితుడిని గతంలోనే పెంట్లూరులో అరెస్టు చేశారు. స్పీడ్ ట్రయల్ కోర్టులో ఈ కేసు ఇటీవల విచారణ పూర్తయింది. విజయవాడ పోక్సో కోర్టు జడ్జి జస్టిస్ వి.భవానీ నిందితుడికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. నిందితుడికి రూ.6 వేల జరిమానా సైతం విధించారు. బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
























