Kodali Nani comments in Gudivada: ఏపీలో అధికార వైఎస్ఆర్ సీపీ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తుండగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యుద్ధం అంటూ కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని దీనిపై స్పందించారు. చంద్రబాబు, బీజేపీని ఉద్దేశించి కొడాలి నాని మాట్లాడుతూ.. అలాగే అందరూ కలిసే యుద్దం చేస్తారా లేక ఎవరు ఎవరితో చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీనో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా అని ఎగతాళి చేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు, ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడంటూ కొడాలి నిలదీశారు. చంద్రబాబు ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడని ప్రశ్నించారు. గురువారం గుడివాడలో కొడాలి నాని ఓ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, జనసేనలో టిక్కెట్లు ఆశించేవారికైనా ఎవరు ఎక్కడి నుంచి యుద్ధం చేయాలనుకుంటున్నారో వారికైనా క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడ, ఎన్ని సీట్లలో పోటీచేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోవాలని సూచించారు. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన నేతలు యుద్ధం పేరుతో తమ ఫ్లెక్సీల పక్కన వారి యుద్ధం ఫ్లెక్సీలు పెడుతున్నారని విమర్శించారు. ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదని, కామెడీ పోస్టు అవుతుందని కొట్టిపారేశారు.
‘‘చంద్రబాబు, పవన్ ఎవరితో యుద్ధం చేస్తారు. ఎవరు యుద్ధానికి సిద్ధమో.. కనీసం వారికైనా క్లారిటీ ఉందా? చంద్రబాబు, పవన్ ఎక్కడెక్కడ పోటీ చేస్తారో వారికే తెలియదు. మీరు ఎన్నిచోట్ల పోటీ చేస్తారో ముందు చూసుకోండి. ప్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం కాదు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ములేని వారు యుద్ధం, సంసిద్ధం అని మాట్లాడుతున్నారు’’ అని కొడాలి నాని మాట్లాడారు.