Vijayawada : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ వర్గాలు నిర్వహిస్తున్న ధర్నాను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు ప్రింటింగ్ ప్రెస్ సమీపంలో టెంట్లు వేసి ధర్నా చేపట్టారు. ఇది అనధికారికమని, ధర్నా చౌక్ వదిలి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై టెంట్లు వేశారని ఎమ్మెల్యో బోండా ఉమ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ టెంట్లను తొలగించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ సెంట్రల్ సహా యాడికి, పొన్నూరులోనూ వైసీపీ ధర్నా చేస్తున్న టెంట్లు తొలగించారు. ఇరు వర్గాలు కుర్చీలు, టమాటాలు, కోడిగుడ్లు విసురుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా - మల్లాది విష్ణు
ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా? తమపై దాడులు ఎంత వరకు సబబు, రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డాపు వైసీపీ నేత మల్లాది విష్ణు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని కేంద్ర ప్రభుత్వం జ్యోక్యం చేసుకుని తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ దాడులేంటని ప్రశ్నించారు.
చంద్రబాబుపై అనవసర విమర్శలు ఊరుకునేది లేదు - బోండా ఉమ
ధర్నా చేసేందుకు ఇక్కడ అనుమతి లేదు, రోడ్డుపై టెంట్ వేసి ధర్నాలు ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే బోండా ఉమ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, మంత్రి లోకేష్ పై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బోండా ఉమ. గత ప్రభుత్వం యువతను మోసం చేసింది..వాళ్లు కల్పించలేని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు బోండా ఉమ. 18వేల మంది డీఎస్సీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితాలు నాశనం చేసేందుకు వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. డీఎస్సీ నిర్వహణ, పారదర్శకతపై చర్చించేందుకు రావాలని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు..దానిపై చర్చించే దమ్ము, ధైర్యం జగన్ పార్టీ నేతలకు లేదు..ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే ఇంటికొచ్చి కొడతాం అని హెచ్చరించారు బోండా ఉమ. ధర్నా చౌక్ లో ఆందోళన చేసి ఉంటే తాము అడ్డుకునేవారం కాదని స్పష్టం చేశారు.
రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు-పేర్నినాని
YSRCP దీక్షా శిబిరంపై టీడీపీ వర్గాల దాడి ఘటనపై తీవ్రస్థాయితో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయ్..రౌడీయిజానికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారు అన్నారు. బోండా ఉమ అధికారమదంతో..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేశారని..అధికారపార్టీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బోండా ఉమ లాంటి వందమంది రౌడీలను పోగేసుకుని చంద్రబాబు, లోకేశ్ శునకానందం పొందినా ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవదని, శిశుపాలుడి పాపాల మాదిరిగా లెక్కిస్తున్నారు ప్రజలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతాం అని బెదిరిస్తున్నారు..మీకు చేతనైంది చేసుకోండి ఎంతమందిని కొడతారో చూస్తాం అని సవాల్ విసిరారు నాని.
