ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేయటంతో మాజీ హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. తాను ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని లేదంటే ఇంటికే పరిమితం అవుతానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో మాజీ హోం మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వైసీపీ శాసన సభ్యురాలు సుచరిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో లీడర్‌నే అయినా భర్త ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తానన్నారు. 


తాను జగన్‌తోనే ఉంటానని అయితే భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ పార్టీ మారతానంటే భార్యగా ఆయన వెనుక వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని సుచరిత కామెంట్ చేశారు. అదే సమావేశంలో పక్కనే ఉన్న ఆమె భర్త కూడా సుచరిత వ్యాఖ్యలపై స్పందించారు. దానిపై క్లారిటీ ఇవ్వు అని కూడా అన్నారు. అయితే సుచరిత తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. అయితే ఆమె చేసిన కామెంట్స్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. సుచరిత, ఆమె భర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి వెళుతున్నారని ప్రచారం నడిచింది. ఇప్పుడున్న స్థానంలో సుచరిత, భర్తకు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. 


దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది సుచరిత, ఆమె భర్తకు ఫోన్ చేసి మరి మాట్లాడటంతో భార్యా భర్తలకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. దీంతో వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లాలోని పెద నందిపాడులో జరిగిన సమావేశంలో మేకతోటి సుచరిత మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా వైరల్ అవుతున్నాయన్నారు. తాను ఉంటే జగన్‌తో ఉంటానని, లేదంటే ఇంటికే పరిమితం అవుతానని వెల్లడించారు. అంతే కాదు తన భర్త ఎటు వెళితే అటు వెళతానని చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. భార్యగా భర్త అడుగు జాడల్లో నడుచుకుంటానని స్పష్టం చేశారు. మెదటి నుంచి తమ కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలికి దగ్గరగా ఉంటుందని, అది చూసి తట్టుకోలేని వారే ఇలాంటి ప్రచారాలు చేశారని ఆమె మండిపడ్డారు.


వైఎస్ఆర్ సీపీ నేతలే ప్రమేయంతోనే ప్రచారాలు 


ఇలాంటి ప్రచారాలు చేయటంలో సొంత పార్టీ నేతలు ఉన్నారనే అనుమానం కూడా పార్టీ నేతల వద్ద సుచరిత ప్రస్తావించారని అంటున్నారు. తాను మాట్లాడింది పార్టీ కార్యాక్రమంలో అని అక్కడ మీడియా కూడా లేదని అలాంటప్పుడు ఆ వ్యాఖ్యలు రికార్డ్ చేసి బయటకు వెళ్లి సోషల్ మీడియాలో పెట్టిందెవరని ఆమె ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ కామెంట్స్‌ను ట్రోల్ చేయటం వెనుక, వైరల్ చేయడం వెనుక సొంత నేతల హస్తం ఉందని అధినాయకత్వానికి వివరణ కూడా ఇచ్చారని చెబుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా తన సొంత మనుషులే అన్న ఉద్దేశంతో మనస్సులో ఉన్న మాటలను వ్యక్తం చేశానని, తాను పార్టీ మారాలనుకుంటే, ఆ విషయాన్ని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఎందుకు చెప్తానని సుచరిత అన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయంలోని నేతలతో సుచరిత మాట్లాడి... తన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్ధాన్ని వివరించారని చెబుతున్నారు.


ఈ వ్యవహరంపై సుచరిత భర్త,మాజీ ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ కూడా వివరణ ఇచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులంతా రాజకీయాల్లోకి రావాలని నిబంధన ఏమీ లేదన్నారు. తమ కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి సానుభూతిగా ఉంటుందిన తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గంలో తాము పోటీ చేస్తున్న నాటి నుంచి ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు వైఎస్ కుటుంబం కారణమని,అలాంటిది పార్టీ మారాల్సి అవసరం లేదన్నారు.