Godavari Floods: గోదావరి నది చేస్తున్న బీభత్సాన్ని చూసి ప్రజలంతా చాలా భయపడిపోతున్నారు. ముఖ్యంగా ధవళేశ్వం కాటన్ బ్యారేజీ వద్ద ప్రవహిస్తున్న నీటిని చూసి గజగజా వణికిపోతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ  ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 18.46 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇది అంతంకంతకూ పెరుగుతూనే పోతుంది. గురువారం రాత్రి 12 గంటల సమయానికి బ్యారేజీలో నీటి మట్టం 16.70 అడడుగులకు చేరి.... 17,53,251 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా అదే స్థాయిలో నీటిని దిగువకు వదిలారు. అయితే కాళేశ్వరం నుంచి భద్రాచలానికి నీరు చేరుకోవడానికి 25 నుంచి 30 గంటలు పడితే... భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి వరద చేరుకోవడానికి 15 నుంచి 18 గంటలు పడుతుందని అంచనా వేస్తున్నారు. 


25 లక్షల క్యూసెక్కులు దాటితే... 


ఎగువన వర్షాలు, వరద ప్రవాహం ఆధారంగా ఆరోజు మధ్యాహ్నం నుంచి వరద తీవ్రత మరింత పెరగవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రవాహం 25 లక్షల క్యూసెక్కుకలు దాటితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుకున్నారు. అలాగే ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయి ప్రసాద్, ఎండీ బి. ఆర్ అంబేద్కర్ లు కంట్రోల్ రూం నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయితే వరద ప్రవాహం 22 నుంచి 23 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


554 గ్రామాలపై ప్రభావం పడే అవకాశం..


ఈ వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరితే... 6 జిల్లాల్లోని 42 మండలాల్లో  554 గ్రామాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 8 మండలాలపై వరద ప్రభావం కనిపించబోతుంది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 5 , పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 మండలాలపై, ఏలూరులో 3, కాకినాడలో 2 మండలాలపై వరద ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఈ క్రమంలోనే అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూం నుంచే కలెక్టర్ లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 


రంగంలోకి 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..


వరద ఉద్ధృతి దృష్ట్యా ముందస్తుగానే.. అదనపు సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో మొత్తం 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వీరు వెంటనే రంగంలోకి దిగి సాయం చేయనున్నారు. అయితే గోదావరి పరివాహక ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నదుల, బ్యారేజీల వద్దకు అస్సలే రాకూడదని హెచ్చరిస్తున్నారు. పాత ఇళ్లలో నివసించే వారు ముందుగానే శిబిరాలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ప్రత్యేక శిబిరాల వద్ద భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు.