Andhra Pradesh: ఏపీలో వరద(Flood) బాదితులకు ప్రభుత్వం సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయాన్ని నేడు బాధితులకు అందజేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలమందికి ఈ సాయం అందాల్సి ఉంది. మొత్తంగా రూ.597 కోట్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 4 లక్షలమందిలో విజయవాడ ప్రాంతం నుంచే లక్షన్నర మంది బాధితులు సాయం అందుకోబోతుండటం విశేషం. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్​లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు నేరుగా ఆర్థిక సాయం చెక్కులను అందిస్తారు. 


రోజుల వ్యవధిలోనే..
విజయవాడ సహా రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. అప్పటికప్పుడు బాధితులకు పునరావాసం, నిత్యావసరాలు అందించింది ప్రభుత్వం. ఇక రోజువారీ జీవనానికి కష్టమైపోయిన వారికి కూడా కొన్ని దాతృత్వ సంస్థలు నేరుగా ఆర్థిక సాయం చేశాయి. తాజాగా ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరదలు తగ్గిన వెంటనే నష్టం అంచనాకు రెవెన్యూ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బాధితుల వివరాలు సేకరించి, వారికి జరిగిన ఆస్తి నష్టం తదితర వివరాలు నమోదు చేసుకున్నాయి.


పంట, పశు సంపద నష్టం అంచనాకు వచ్చిన ప్రత్యేక బృందాలు తమ పని పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. అటు కేంద్రం కూడా తక్షణ సాయం ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాల రూపంలో కూడా నిధులు సమకూరాయి. ఈరోజు బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ ఫర్ (DBT) పద్ధతి ద్వారా ఈరోజు వరదసాయం బాధితుల బ్యాంక్(BANK) ఖాతాల్లో జమ అవుతుంది. 


ఆగస్ట్ నెలాఖరులో, సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏపీలో వరదసాయం అందించేందుకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే సిద్ధమైందని, ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు కూటమి నేతలు. ఇతరత్రా సాయాలను పక్కనపెడితే బాధితులకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ఆర్థిక సాయం మొదలు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా రోజలు వ్యవధిలోనే పూర్తి కావడంతో ఇప్పుడు సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 


వరదల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారితోపాటు.. తోపుడు బళ్లు కొట్టుకుపోయిన చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక వ్యక్తిగత వాహనాల నష్టం వారిని మరింత బాధిస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల చెల్లింపులతో ఆ నష్టం కాస్త తగ్గినా వాహనాలు పాడైపోయి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న తరహా పరిశ్రమల యజమానులకు, పంటలు, పశువులను నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. 


ఎన్డీఆర్ఎఫ్(NDRF) మార్గదర్శకాలకు మించి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని అంటున్నారు కూటమి నేతలు. ముంపు ప్రాంతాల్లో రూ. 180 కోట్ల మేర బ్యాంక్ రుణాలను కూడా ప్రభుత్వం రీ-షెడ్యూల్ చేస్తోంది. ఒకవేళ బాధితులెవరైనా తమకు సాయం జరగలేదని భావిస్తే అధికారులను సంప్రదించాలని.. ఎన్యుమరేషన్ లో ప్యాకేజీ అందని వారికి నిబంధనల మేరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 


Also Read: వైఎస్ఆర్‌సీపీకి మరో బిగ్ షాక్ - రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా - ఆమోదం కూడా !