ECI on Fake Votes : దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. దొంగ ఓట్ల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఉన్నతాధికారులను వరుసగా సస్పెండ్ చేస్తోంది. తాజాగా తిరుపతి (Tirupati) పార్లమెంట్ ఉప ఎన్నికల్లో...దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రస్తుతం విజయవాడ (Vijayawada)మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి (Chandramouliswar Reddy)ని ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సమయంలో...నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌గా పనిచేశారు.  ఆర్‌వో లాగిన్‌తో 35వేల ఓటరు కార్డులు డౌన్‌లోడ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు ముగిసిన కొంతకాలానికి చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చంద్రమౌళీశ్వర్ రెడ్డిపై వేటు వేసింది. ఇప్పటికే దొంగ  ఓట్ల వ్యవహారంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా సస్పెండ్‌ చేసింది. విజయవాడ దాటి వెళ్లవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 


ఓట్ల అక్రమాలపై విపక్షాల ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ముసాయిదా జాబితాను సవరించామని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. అయితే తిరుపతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలించే కొద్దీ ఓట్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఓటర్ల తుది జాబితా కూడా ముసాయిదా జాబితా తరహాలోనే తప్పుల తడకగా ఉంది. చిరునామాలను సబ్ డివిజన్లుగా మార్పు చేసి ఇంటి యజమానులకు తెలియకుండా లెప్రసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యవేడు, రాయచోటి, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని జాబితాలో చేర్చారు.