Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఉదయం విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్లో బ్రేక్ ఫాస్ట్ చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఉదయం 9.30 గంటలకు పటమట హైస్కూల్ రోడ్డులోని రైతు బజార్ వద్ద ఉన్న క్యాంటీన్‌కు చేరుకున్న ఆయన, తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అక్కడ అల్పాహారం తీసుకున్నారు. సామాన్య ప్రజలతో కలిసి కూర్చుని అల్పాహారాన్ని స్వీకరించారు. సమయంలో సాధారణ పౌరులు, సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. అన్న క్యాంటీన్లలో ఆహారం నాణ్యత అడిగి తెలుసుకున్నారు.
నారా భువనేశ్వరి విరాళం - ఉచిత భోజన వితరణ
చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఒక రోజు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల సోమవారం నాడు రాష్ట్రంలోని అన్ని క్యాంటీన్లలో పేదలకు మూడు పూటలా ఉచితంగా ఆహారం లభించనుంది.
రూ.10 ఇవ్వబోయిన చంద్రబాబు.. తీసుకోని అన్న క్యాంటీన్ సిబ్బంది
పేదలు, కార్మికులు, ప్రజల మధ్య సీఎం చంద్రబాబు తన జన్మదినాన్ని సాదాసీదాగా జరుపుకున్నారు. అన్న క్యాంటీన్ లబ్ధిదారులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు దంపతులు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం సీఎం చంద్రబాబు రూ.10 ఇచ్చి రెండు టోకెన్లు తీసుకోబోగా, నేడు అన్నక్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అని టోకెన్ నిర్వహకుడు తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అల్ఫాహారాన్ని తీసుకున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా అన్న వితరణ చేస్తున్నారు.

అన్న క్యాంటీన్లో బ్రేక్ ఫాస్ట్ తరువాత సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘అన్న క్యాంటీన్లో కేవలం రూ.5కే గౌరవప్రదంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రారంభించాం. పేదలకు ఉదయం, మధ్యాహ్నం ,రాత్రి అన్న క్యాంటీన్లో తక్కువ ధరకు ఫుడ్ లభిస్తుంది. బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాలి. వీటిని దృష్టిలో ఉంచుకుని అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకే కడుపు నింపుతున్నాం. ఇస్కాన్ ఫౌండేషన్ వారు సెంట్రల్ కిచెన్ ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారు. రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మరో 5 త్వరలో ప్రారంభించనున్నాం. నా పుట్టినరోజు సందర్భంగా రూ.76 లక్షలను సతీమణి నారా భువనేశ్వరి విరాళం ఇచ్చారు. ఈరోజు మూడు పూటలా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం లభిస్తుంది. అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. మీకు వీలైతే ఒక్కపూట, ఒక్కరోజు.. మీకు ప్రత్యేకమైన రోజున అన్నదానం చేసి పేదవారి ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం ఇది. పీ4 కార్యక్రమం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేయవచ్చు. పైన ఉండే 10 శాతం వర్గాలు అట్టడుగున ఉండే 20 శాతం వారికి ఏదో రూపంలో సాయం చేసి ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ముందుకు రావాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం
సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని అన్న క్యాంటీన్లలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని పేదలకు స్వయంగా భోజనాలను వడ్డించారు. రాష్ట్రమంతటా ప్రతి పేదవాడు ఈరోజు ఉచితంగా ఆహారం తినాలని, ఆకలితో ఉండకూడదని నారా భువనేశ్వరి సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే అన్న క్యాంటీన్లలో ఒక్కరోజు మూడు పూటలా ఆహారానికి సంబంధించి విరాళం అందించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















