తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇకపై మరింత జోరు పెంచనున్నారు. తెలంగాణా ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా పోరు తీవ్రతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయంగా దూకుడు పెంచేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపై మరో ఎత్తు అన్న చందంగా చంద్రబాబు డెయిలీ షెడ్యూల్ ఉండబోతోందని ఆ వర్గాలు అంటున్నాయి. 


తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కూడా హీట్‌ ఎక్కుతున్నాయి. దీంతో ఏ చిన్న విషయాన్ని కూడా అంత ఈజీగా పార్టీలు తీసుకోవడం లేదు. పార్టీ కార్యకలాపాలపై అధినేతలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలానే చంద్రబాబు కూడా పార్టీపై ఫుల్‌ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే చంద్రబాబు విజయవాడ కేంద్రంగా అందుబాటులో ఉంటున్నారు. రాజకీయ నాయకులకు అందుబాటులోకి వస్తున్నారు. ఇప్పుడు ప్రతి నిత్యం నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 


ఓ వైపు తెలంగాణా ఎన్నికల షెడ్యుల్‌ మరో రెండు నెలల్లో రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. అక్కడ షెడ్యూల్ ప్రకారమే జరిగనా లేకుంటే ముందస్తు జరిగినా సిద్ధంగా ఉండేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. అందుకే పార్టీ కార్యకలాపాలపై చంద్రబాబు నిత్యం పర్యవేక్షణ చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీ శ్రేణులతోపాటుగా, తెలుగు దేశం కేంద్రం కార్యాలయం, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం వరకు ఉన్న స్టాఫ్‌కు అలర్ట్ ఇచ్చారట. 


నో వీకెండ్....
ఇప్పటి వరకు చంద్రబాబు వారంలో ఐదు రోజులు పాటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. అయితే ఇకపై ఏడు రోజులు పాటు పాలిటిక్స్‌లోనే గడపేందుకు యాక్టివ్ అవుతున్నట్లుగా పార్టి వర్గాలు అంటున్నాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసానికి చంద్రబాబు వెళుతుంటారు. తిరిగి సొమవారం లేదా, మంగళగవారం విజయవాడకు వచ్చే వారు. అయితే ఇకపై వారం రోజులు యాక్టివ్ పాలిటిక్స్‌లో విజయవాడలోనే ఉండాలని నిర్ణయించినట్టు నేతలు అంటున్నారు. జాతీయ స్థాయి పాలిటిక్స్‌లో కూడా దూకుడు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. రానున్న రోజుల్లో కీలకమైన నేతలను వ్యక్తిగతంగా కలవటం, వారితో మాట్లాడటం చేయబోతున్నారని టాక్. 


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ ఇప్పటికే దూకుడు పెంచింది. రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ పాలిటిక్స్‌పై కసరత్తు కూడా చేస్తోంది. ఓ వైపున తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ జిల్లాలను టచ్ చేస్తున్నారు. మరో వైపున భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో నేతల బస్సు యాత్రలో తిరుగుతున్నారు. మూడు జోన్‌లుగా విభజించి మరీ ఐదు బస్సుల్లో ఈ యాత్ర సాగుతోంది. కొద్ది రోజులుగా అధినేత చంద్రబాబు కేంద్ర పార్టి కార్యాలయంలోనే పార్టీ శ్రేణులను పిలిచి మాట్లాడుతున్నారు. టెలి కాన్ఫరెన్స్‌లను కూడా నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో హ్యాపెనింగ్స్ పై కూడా ఏప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ, వాటిపై పార్టీ తరపున రియాక్ట్ అయ్యే విధానం పై దిశానిర్దేశం చేస్తున్నారు. వీటితోపాటు నెలలో ఒకట్రెండు సార్లు జిల్లాల పర్యటనకు కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి మోహరించి ప్రజలను టార్గెట్ రీచ్ కావాలని చూస్తున్నారు.