Chief Election Commissioner Rajiv Kumar: విజ‌య‌వాడ‌: కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) అధికారులు సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar), ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే (Anoop Chandra Pande ), అరుణ్ గోయల్‌ లు సోమవారం రాత్రి ఢిల్లీ నుండి బయలు దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు స్వాగతం పలికారు.


నోవాటెల్ హోటల్లో 2024 ఎన్నికల సదస్సు.. 
విజయవాడ నగరంలోని నోవాటెల్ హోటల్లో జనవరి 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు పార్లమెంట్, అసెంబ్లీ-2024 ఎన్నికల సన్నద్ధతపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు హాజరు కానున్న చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ లు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్ కు బయలు దేరి వెళ్ళారు. నోవాటెల్ హోటల్ వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, సబ్ కలెక్టర్ అదితి సింగ్. డిఆర్ఓ ఎస్.వి.నాగేశ్వరావులు స్వాగతం పలికారు.


చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు మంగళవారం రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 10వ తేదీన ఎన్నికల సన్నద్దతపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.