Bill Gates AP Visit: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. కాసేపట్లో స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు ప్రజంటేషన్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఫిబ్రవరి 16న ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన తరువాత సేఫ్ ల్యాండ్ అయింది.

Bill Gates Arrives at Gannavaram Airport | విజయవాడ: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులు బిల్ గేట్స్‌కు ఘనంగా స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి వారంతా నేరుగా అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు.
కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం..
అంతకుముందు, భారీ పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు కొంత అంతరాయం కలిగింది. దీంతో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది, అనంతరం వాతావరణం అనుకూలించడంతో సురక్షితంగా ల్యాండైంది. సౌత్ కొరియా నుంచి నుంచి వచ్చిన బిల్ గేట్స్ విమానం సేఫ్‌గా ల్యాండింగ్ కావడంతో ఏపీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ గారికి స్వాగతం పలికిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు.#APWelcomeBillGates#BillGates pic.twitter.com/b2IwB1CTSo
— Dudekula dastagiri (@Dudekuladasta16) February 16, 2026
బిల్ గేట్స్‌తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్వయంగా వివరించనున్నారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల విస్తరణపై కీలక చర్చలు జపనున్నారు.
సచివాలయానికి బిల్ గేట్స్ టీమ్.. పూర్తి షెడ్యూల్
బిల్ గేట్స్ సోమవారం ఆరుగురు ప్రతినిధుల బృందంతో కలిసి అమరావతి సచివాలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లతో ఆయన సమావేశమవుతారు. అనంతరం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికతను జోడించి ప్రభుత్వం సాధిస్తున్న ఫలితాలను స్వయంగా పరిశీలిస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్యాలను వివరిస్తూ, ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న 'సంజీవని' ప్రాజెక్టు, మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవల విస్తరణపై ఈ భేటీలో చర్చించనున్నారు.
సచివాలయ కార్యక్రమం ముగిసిన తర్వాత, బిల్ గేట్స్ బృందం ఉండవల్లిలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంది. అక్కడ సాగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును వారు ప్రత్యక్షంగా తిలకిస్తారు. సాంకేతికత ద్వారా రైతుల ఉత్పాదకతను ఎలా పెంచవచ్చో ఈ సందర్భంగా ప్రభుత్వం వివరించనుంది.
























