Ayesha Meera Murder Case : ఆయేషా మీరా కేసు క్లోజ్! ముగిసిన 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం!
Ayesha Meera Murder Case : 2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైంది.

Ayesha Meera Murder Case : పెను సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అధికారికంగా ముగిసింది. సుమారు 17 ఏళ్ల పాటు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అసలు దోషి ఎవరో తేల్చలేక సీబీఐ చేతులెత్తేయడంతో న్యాయస్థానం ఈ కేసును మూసివేస్తూ సంచలనం నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ ఈ మేరకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సుదీర్ఘ పోరాటంలో ఎన్నో దర్యాప్తు సంస్థలు మారాయి. ఎంతో మంది అధికారులు విచారణ చేశారు. కానీ ఆయేషా తల్లిదండ్రులకు ఆశించిన న్యాయం మాత్రం దక్కలేదు. చివరకు తమ కుమార్తె శరీర అవశేషాలైనా తమకు అప్పగిస్తే మతాచార ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకుంటామని వారు కోరడం అందర్నీ కలచివేస్తోంది.
ఆరేళ్ల సీబీఐ దర్యాప్తులో తేలిందేంటీ?
హైకోర్టు ఆదేశాల మేరకు 2019లో రంగలోకి దిగిన సీబీఐ, గత ఆరేళ్లుగా ఈ కేసును నిశితంగా పరిశీలించింది. ఈ దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు మృతురాలి శరీర భాగాలను వెలికి తీయించి గాంధీ ఆసుపత్రి వైద్యులతో రెండోసారి పోస్టుమార్టం కూడా చేయించారు. గతంలో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను సైతం విచారించారు.
అయితే గతేడాది ఏడాది సీబీఐ సమర్పించిన తుది నివేదికలో చేదు నిజాలు వెల్లడించింది. 2007లో జరిగిన ఈ హత్యకు సంబంధించి కొత్తగా ఎలాంటి సాక్ష్యాలు లభించడం లేదని సీబీఐ స్పష్టం చేసింది. గతంలో పోలీసులు సేకరించిన సాక్ష్యాలన్నీ సత్యంబాబే నిందితుడని చెబుతున్నాయని అయితే ఆ సాక్ష్యాలను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని సిబీఐ గుర్తు చేసింది. హత్య జరిగిన చాలా కాలం కావడంతో శాస్త్రీయంగా కొత్త ఆధారాలు సేకరించడం అసాధ్యమని సీబీఐ చేతులెత్తేసింది.
ఆయేషా హత్య కేసులో సినిమాటిక్ మలుపులు
2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైంది. స్థానిక పోలీసులు సత్యంబాబును నిందితుడిగా అరెస్టు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతనికి శిక్ష కూడా ఖరారు చేసింది. 2017లో సత్యంబాబు నిర్దోషి అని, అతడిని అన్యాయంగా ఇరికించారని పేర్కొంటూ హైకోర్టు అతడిని విడుదల చేసింది. అసలు నేరస్థులను పట్టుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ 11 నెలల పాటు దర్యాప్తు చేసింది. అయితే దిగువకోర్టులో ఈ కేసుకి సంబంధించిన కీలక సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు రిపోర్ట్ చేసింది. సిట్ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు 2019లో సీబీఐకి కేసు అప్పగించింది. ఇప్పుడు సీబీఐ కూడా చేతులు ఎత్తేసింది.
తల్లిదండ్రుల పోరాటం
కుమార్తెను చంపిన అసలు దోషులను పట్టుకోవాలని ఆయేషా తల్లి శంషాద్‌బేగం ఏళ్ల తరబడి పోరాటం చేశారు. సీబీఐ కూడా నిందితులను పట్టుకోలేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. సీబీఐ సమర్పించిన క్లోజ్ రిపోర్ట్‌పై తాము ఎలాంటి ప్రొటెస్టు పిటిషన్లు గానీ, ప్రైవేటు కేసులుగానీ వేయడం లేదని వారు కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో దోషి తేలకుండానే కేసు మూసివేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
ఫిబ్రవరి 27న అంతిమ వీడ్కోలు
రీ పోస్టుమార్టం కోసం తీసుకున్న ఆయేషా శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు, ఈ నెల 27 తేదీని ఉదయం 10 గంటలకు అప్పగించాలని ఆదేశించింది. న్యాయస్థానంలో గుర్తింపు పంచనామా నిర్వహించిన తర్వాతే అవశేషాలను అప్పగించాలని పేర్కొంది. తగిన భద్రతతో ప్రభుత్వ వాహనంలో అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించారని పేర్కొంది. అక్కడ వారి మతాచారం ప్రకారం గౌర ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేలా అధికారులు సహకరించాలని సూచించింది. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని పేర్కొంది.























