Tammineni Sitaram Comments : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) తమ్మినేని సీతారాం (Tammineni Sitaram)కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే (Rebel Mlas)లను మరోసారి విచారణకు పిలుస్తానన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడనన్న ఆయన...అనేక విషయాలపై ఇంకా మాట్లాడాల్సి ఉందన్నారు. తాను అడగాల్సింది అడిగానన్న ఆయన, ఎమ్మెల్యేలు చెప్పాల్సింది చెప్పారని తమ్మినేని సీతారాం తెలిపారు. స్పీకర్ తో మాట్లాడిన విషయాలను బయటకు చెప్పకూడదని, అది పెద్ద నేరమన్నారు. ఓ పార్టీలో పుట్టి.. ఇంకో పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదు అనేది వారు డిసైడ్ చేసుకోవాలని హెచ్చరించారు. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. అనర్హత వేటు విషయంలో స్పీకర్ పై సీఎం జగన్ ఒత్తిడి తెస్తున్నారని చెప్పడం సరికాదని తెలిపారు.
గడువు కోరినా ఇవ్వలేదంటున్న రెబల్ ఎమ్మెల్యేలు
వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వైఎస్సార్‌సీపీ అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 29న విచారణకు రావాలని ఇటీవల స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు పంపింది. రెబల్ ఎమ్మెలయే నెల రోజులు గడువు కోరారు. కుదరదని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేయడంతో... వారంతా సోమవారం విచారణకు హాజరయ్యారు. తమ అభిప్రాయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు వివరించారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలికిన కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్, మద్దాళి గిరిధర్‌లపై అనర్హత వేటు వేయాలని టీడీపీ పిటిషన్ ఇచ్చింది. వారికి కూడా స్పీకర్ ఇటీవల నోటీసులు జారీచేశారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ...వాసుపల్లి గణేష్‌కుమార్ మాత్రమే హాజరయ్యారు.
స్పీకర్ ఇచ్చిన డాక్యుమెంట్లకు విశ్వసనీయత లేదంటున్న రెబల్స్
స్పీకర్ తమకు ఇచ్చిన డాక్యుమెంట్లలో విశ్వసనీయత లేదని రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఎలాంటి విశ్వసనీయత లేని పత్రాలను...ఎలా ప్రమాణికంగా తీసుకుంటారని ప్రశ్నించారు. వ్యక్తిగతం రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను... మూడున్నరేళ్లు పట్టించుకోకుండా, ఇప్పుడే ఆమోదించడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఏమి చేయాలన్న దానిపై తాము ఆలోచిస్తామని రెబల్ ఎమ్మెల్యేలు తెలిపారు. రోగ్యం సరిగా లేదని మెడికల్ సర్టిఫికెట్ పంపినా, ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని చెప్పారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
కొద్దిరోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖను... స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. ఇటీవలే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం అమోదించారు. ఆ తర్వాత వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.