అన్వేషించండి
AP Adulterated Liquor: కల్తీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్, గట్టు రట్టు చేసే క్యూఆర్ కోడ్
కల్తీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

మంత్రి కొల్లు రవీంద్ర
Source : ABP Desam
విజయవాడ: ఏపీలో కల్తీ మద్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లా మొకలకలచెరువులో కల్తీ మద్యం దొరికింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నాం. 23 మంది నిందితులుగా గుర్తించాం. 14 మందిని ఇప్పటికే అరెస్టు చేశాం అని తెలిపారు.
కల్తీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి జనార్ధన్ రావును కూడా గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేశాం. భవానీపురంలో మరో కేసును గుర్తించాం. అక్కడ 12 మందిని నిందితులుగా గుర్తించి 5 గురిని అరెస్ట్ చేశాం. నలుగురికి పీటీ వారెంట్ ఇచ్చాం. జయచంద్రారెడ్డి పాత్ర కూడా ఉందని తేలింది. అందుకే అతని కోసం గాలిస్తున్నాం. ఈ స్కాం మొత్తాన్ని 4 టీములుగా విడిపోయి కేసు విచారణ చేస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఆయా బృందాలు తిరిగి నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని కొల్లు రవీంద్ర తెలిపారు.
పదవులివ్వడమే జగన్ రెడ్డి నైతికతా
జయచంద్రారెడ్డి కల్తీ మద్యం కేసులో ఉన్నాడని తెలియగానే తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేశాం. తెనాలికి చెందిన వైసీపీ బూత్ కన్వీనర్ ఇదే స్కాంలో ఉంటే ఎందుకు సస్పెండ్ చేయలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాకాణి గోవర్ధన్ రెడ్డి, మల్లాది విష్ణు లాంటి వారు తమ కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు తీశారు. వారిని సస్పెండ్ చేయకపోగా పదవులివ్వడమే జగన్ రెడ్డి నైతికతా అని ప్రశ్నించారు.
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే మద్యం వివరాలు
కల్తీ మద్యాన్ని ప్రజలెవరైనా గుర్తించే విధంగా APTATS యాప్ రూపొందించాం. బాటిల్ పై ఉండే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ బాటిల్‌కు చెందిన ప్రతి సమాచారం తెలుసుకోవచ్చు. తయారైన చోటు, బ్యాచ్, డిపో, ఏ షాపుకు చేరింది అనే ప్రతి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాం. కల్తీ వ్యాపారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఒక బాటిల్ వస్తే అది ఎక్కడ తయారైంది, ఏ షాపుకు చేరిందనే ప్రతి వివరాలు ట్రాక్ చేస్తున్నాం. గత ఐదేళ్లు ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారు. కూటమి వచ్చాక ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేశాం. ఎక్సైజ్ శాఖ మెరుగైన పనితీరు కారణంగానే ఈ రెండు చోట్ల కల్తీ మద్యాన్ని గుర్తించాం.
సేల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కారణంగానే ఈ రోజు ఈ స్కాం బయటపడింది. గత ఐదేళ్లు.. సరిహద్దుల్లో అక్రమ మద్యం రవాణా చాలా ఎక్కువగా ఉండేది. పొరుగు రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ ధరలు ఉండడంతో.. అక్రమంగా రవాణా చేశారు. నేడు ధరలు సమానం చేయడంతో పాటుగా, క్వాలిటీ మద్యాన్ని అందించడంతో అక్రమ రవాణా దాదాపు నిర్మూలించాం. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈఎన్ఏ, రెక్టిఫైడ్ స్పిరిట్ అమల్లో ఉంది. కానీ, మన రాష్ట్రంలో ఇలాంటి కల్తీ లేకుండా చూస్తున్నాం. నవోదయం 2.0 ద్వారా నాటు సారాను పూర్తిగా నిర్మూలించాం. 21 జిల్లాలను ఇప్పటికే సారా రహిత జిల్లాలుగా మార్చాం. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ప్రతి బాటిల్‌ను 13 సార్లు పరీక్షిస్తున్నాం. డిపోల నుండి షాపులకు చేరిన తర్వాత కూడా పరీక్షిస్తున్నాం. అక్రమాలు బయటపడితే షాపు లైసెన్సుని పూర్తిగా రద్దు చేస్తాం - కొల్లు రవీంద్ర
అత్యంత పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తూ, ప్రజల కోసం పని చేస్తుంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు. గత ఐదేళ్లు ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా పారదర్శకంగా మద్యం అమ్మామని చెబుతున్నారు. అప్పటి వరకు ఉన్న మల్టీ నేషనల్ బ్రాండ్లు 2019 తర్వాత రాష్ట్రంలో ఎందుకు లేకుండా పోయాయి.? ప్రపంచంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఎలా వచ్చాయి? ప్రభుత్వ షాపుల పేరుతో తన వారికి ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టారు. రవాణా మొత్తాన్ని తమ వారి చేతుల్లో పెట్టారు. రాష్ట్రంలోని మద్యం వ్యాపారం మొత్తాన్ని సిండికేట్ చేసిన జగన్ రెడ్డి మద్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం.
కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరించి, జైలుకు వెళ్లి వచ్చినోళ్లు ఇప్పుడు ఏదో జరిగిపోయిందని రాద్దాంతం చేస్తున్నారు. చేయాల్సిన అరాచకాలు, అకృత్యాలు చేసి సుద్దపూసల్లా మాట్లాడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా 27 మందిని చంపేశారు. ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ అని చెప్పే జగన్ రెడ్డి ఆరోపణలు చేయడం కాదు.. నిరూపించాలి. సాధారణ మరణాలను సైతం మద్యానికి లింక్ చేస్తున్నారు. చనిపోయిన ప్రతి కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోస్టు మార్టం చేస్తున్నాం. ఎవరు ఎక్కడ ఎలా చనిపోయినా మద్యానికి లింక్ చేయమని జగన్ రెడ్డి వైసీపీ నేతలకు చెప్పడం సిగ్గుచేటు.
శవ రాజకీయాలు జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించాడు. బాబాయిని చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. మీ అరాచకాలను చూసి ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా తప్పుడు ప్రచారాలు మానుకోవడం లేదు. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరినీ ఉపేక్షించబోం. కేసులో ఎవరు భాగస్వాములున్నా వదిలిపెట్టబోం. ప్రజల్ని భయాందోళనలకు గురి చేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టబోం. ఏదైనా సమాచారం ఉంటే ముందుకొచ్చి అందించండి. చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకానీ గుడ్డకాల్చి మొహాన వేసి పారిపోతామంటే వదిలిపెట్టం అన్నారు.
చీకొట్టినా బుద్ధి రాలేదు
ప్రజలు చీ కొట్టినా పేర్ని నానికి బుద్ధి రాలేదు. పోలీసులపైనే తిరుగుబాటు చేయడం దుర్మార్గం. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలనే లక్ష్యంతోనే పేర్నినాని వ్యవహరిస్తున్నాడు. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు.. పోలీసులపై దాడి చేయాలనుకోవడం సిగ్గుచేటు. ఇష్టానుసారం మాట్లాడుతామంటే వదిలిపెట్టం. కనుసైగ చేస్తే లేపేయాలి అంటున్న పేర్ని నాని.. మేము కన్ను కొడితే మావాళ్లను నువ్వు తట్టుకోగలవా? మాది ధర్మబద్దంగా నడచుకునే పార్టీ కాబట్టే మేము సంయమనం పాటిస్తున్నాం. 2014లో కల్తీ మద్యం కేసులో బాటిల్ స్వాధీనం చేసుకుంటే.. ఆ బాటిళ్లను పేర్ని నాని పగలగొట్టినందుకే గతంలో జైలుకు వెల్లొచ్చాడు. ఆ విషయం చెప్పకుండా.. తానేదో స్వతంత్ర సమరయోధుడు అన్నట్లు మాట్లాడుతున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
కర్నూలు
క్రైమ్
Advertisement






















