విజయవాడలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Lulu Mall: విజయవాడలో లూలు మాల్‌కు భూకేటాయింపులు రద్దు! కోర్టుకు తెలిపిన ప్రభుత్వం!
విజయవాడ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ఆర్టీసీ భూములను లూలు గ్రూప్‌నకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేటాయింపులు రద్దు చేస్తున్నట్టు కోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.

- విజయవాడ లూలు మాల్ భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది.
- 600 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు సంస్థకు లీజుకివ్వడం వివాదాస్పదమైంది.
- ప్రజా సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
- హైకోర్టులో పిటిషన్ అనంతరం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Lulu Mall: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన విజయవాడ లూలు మాల్‌కు భూ కేటాయింపుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన భూమిని ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది.
విజయవాడలోని గవర్నర్‌పేట ప్రాంతంలో న్న పాత బస్టాండ్ డిపోకు చెందిన సుమారు 4.15 ఎకరాల స్థలాన్ని లూలు గ్రూప్‌నకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ ప్రస్తుతం లెక్కల ప్రకారం ఆరు వందల కోట్లపైనే ఉంటుందని అంచనా. ఇంతటి భారీ విలువైన ప్రభుత్వ ఆస్తిని 99ఏళ్ల లీజు ప్రాతిపదికన మాల్ నిర్మాణానికి అప్పగించడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ భూ కేటాయింపు ప్రక్రియ కేవలం ఆర్థికపరమైన అంశమే కాకుండా, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అనేక సంఘాలు భావించాయి. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, పలు ప్రజా సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ వారు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు.
ఈ భూకేటాయింపులు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ముందు ప్రభుత్వ న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించిందని, ఆ క్రమంలోనే లూలు మాల్‌కు కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సదరు భూ కేటాయింపును రద్దు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అతి త్వరలోనే జారీ చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున అందిన వివరణ నమోదు చేసుకున్న హైకోర్టు ధర్మాసనం, భూ కేటాయింపుల రద్దు సంబంధించిన అధికారిక ఉత్తర్వుల ప్రతిని తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను కొంత కాలం వాయిదా వేస్తూ, తుది ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఆరు వందల కోట్ల విలువైన భూమిని అతి తక్కువ లీజుకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఖజానాకు గండి పడుతుందనే వాదన బలంగా వినిపించింది. ఆర్టీసీ కార్మికుల, స్థానిక ప్రజల ప్రయోజనాలను విస్మరించి తీసుకున్న నిర్ణయంగా ఇది ప్రచారం జరిగింది. ప్రభుత్వం జీ ప్లస్ త్రీ విధానంలో షాపింగ్ మాల్ ఏర్పాటు అనుమతులిచ్చినప్పటికీ, ఆ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వచ్చాయి.
Frequently Asked Questions
విజయవాడ లూలు మాల్‌కు భూ కేటాయింపుల వివాదంపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏమిటి?
లూలు మాల్‌కు కేటాయించిన భూమి విలువ ఎంత?
విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉన్న సుమారు 4.15 ఎకరాల భూమి బహిరంగ మార్కెట్ విలువ ప్రస్తుతం ఆరు వందల కోట్లపైనే ఉంటుందని అంచనా.
ఈ భూ కేటాయింపులపై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి?
అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తిని తక్కువ లీజుకు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని, పారదర్శకత లోపించిందని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందా?
అవును, ఈ భూ కేటాయింపులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు హామీ ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు



















