ప్రభుత్వ ఉద్యోగులతో సర్కార్ మరో సారి చర్చలు జరిపింది. అయితే ఈ సారి కూడా ఉద్యోగ సంఘాలు పెట్టిన ప్రధాన డిమాండ్ల పై సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ జరగలేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.


సీఎస్ తో ఉద్యోగ సంఘాల సమావేశం


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తో సమావేశం అయ్యారు. గత 84 రోజులుగా చేస్తున్న ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలకు పిలిచిందని అమరావతి జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా కాలంగా పరిష్కారం కానీ సమస్యలను పరిష్కరించాలని కోరామని ఆయన తెలిపారు.కొన్ని సమస్యలపై సీఎస్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.


వీఆర్ఏల డీఏ తో పాటు వీఆర్వో గ్రేడ్ 2 కు సంబంధించిన అంశాలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ లభించిందని వివరించారు.180 రోజులు మహిళ ఉద్యోగుల మేటర్నటీ లీవ్ ను ప్రొబేషన్ సమయంలో డ్యూటీ పిరియడ్ గా పరిగణించమని కోరినట్లు ఆయన తెలిపారు.దీని పై మరింతగా చర్చించనున్నట్లు ఆయన వివరించారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులపై సుధీర్ఘ సమయం చర్చలు జరిపామని,వెల్ఫేర్ సెక్రటరీ పేరు మార్చడంతో పాటు పదోన్నతులు కలిపించమని కోరినట్లు ఆయన వెల్లడించారు.మహిళ సెక్రటరీ ను మహిళ పోలీసులుగా సేవలందించడం పై అభ్యంతరం వ్యక్తం చేశామని,ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చాలా అంశాలపై సానుకూలంగా స్పందించారని అన్నారు.


క్యాబినేట్ లో కీలక నిర్ణయాలు!


జూన్ 7 వ తేదీన క్యాబినేట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశాలపై పూర్తి స్దాయిలో చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో మంత్రి వర్గం భేటీ కీలకంగా మారింది. క్యాబినెట్ సమావేశంలో మిగిలిన అంశాలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి చర్చిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి హామి ఇచ్చారు.జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగులకు అనుకూలంగా లిఖితపూర్వకంగా హమీ ఇస్తే దాని పై చర్చించి ఉద్యమంపై ఆలోచన చేస్తామన్నారు.ఎప్పుడు లేని విధంగా చాలా సమయం కేటాయించి తమతో సిఎస్ చర్చలు జరిపినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నామని బొప్పరాజు అన్నారు.


ఉద్యమం కొనసాగుతుంది - సూర్యనారాయణ రాజు


మే 22 నుండి ఎపి వ్యాప్తంగా ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయని,ఇప్పటి వరకు విజయవంతంగా మండుటెండల్లో ఉద్యోగులు నిరసన చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సూర్యనారాయణ రాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఉద్యమానికి 3 లక్షల రుపాయలు ఇచ్చారని,ఒక్కొక్క ఉద్యోగి వంద రుపాయలు చెల్లించి నిరసనలో పాల్గొవాలని ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు చెల్లించారని అన్నారు.ఈ నెల 8 వ తేది నుండి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగ సంఘాల చర్చలకు మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.మా సంఘం క్షేత్రస్దాయిలో చేస్తున్న నిరసనలు ప్రభుత్వానికి తెలుస్తాయని,దానికి స్పందించి 11 పిఆర్సీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం మాకు తెలిసిందని వివరించారు.అందరు ఉద్యోగులు పాల్గొంటేనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అరెస్ట్ చేసిన జీఎస్టీ అధికారులో మహిళ ఉద్యోగి ఉన్నారని,ఎటువంటి సమాచారం లేకుండా పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.నిజంగా తప్పు చేస్తే ఎందుకు మఫ్టీలో పోలీసులు తీసుకువెళ్లారని ప్రశ్నించారు.అరెస్ట్ లపై కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వలేదని,మీడియా సమావేశం పెట్టిన తరువాత మాత్రమే ఉద్యోగుల అరెస్ట్ పై ప్రెస్ నోట్ విడుదల చేశారని సూర్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు.