ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్న కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. వరుసగా నాలుగో విడతకు సంబంధించిన వైఎస్ఆర్ నేతన్న హస్తం నిధులను ఈరోజు విడుదల చేయబోతున్నారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించే బహిరంగ సభలో బటన్ నొక్కి మరీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్థిక సాయం అందించడం ఈ పథకం లక్ష్యం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.24 వేలు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అలా ఐదేళ్ల కాలంలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1.2 లక్షలు అందుతుంది.
అయితే ఏపీ వ్యాప్తంగా మొత్తం 80,546 మంది నేతన్నలకు 4వ విడతలో భాగంగా 193.31 కోట్ల రూపాయలను సీఎం జగన్ నేడు జమ చేస్తారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు నేరుగా ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం 776.31 కోట్ల రూపాయలు. ఇప్పటికే 3 విడతల్లో సాయం అందగా తాజాగా నాల్గోవిడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది 2022 - 23 ఆర్థిక సంవత్సరానికిగాను కృష్ణా జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన 4,100 మంది నేతన్నలకు 9 కోట్ల 84 లక్షల రూపాయలను లబ్ధాదారుల ఖాతాల్లో వేయబోతున్నారు.
పెడనలోనే 7 చేనేత సహకార సంఘాలు..
కృష్ణాజిల్లాలో 5,192 మగ్గాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 18, 027 మంది నేతన్నలు తమ వృత్తిలో కొనసాగుతున్నారు. చేనేత పరిశ్రమ గత 500 ఏళ్లుగా ఈ ప్రాంతంలో స్దిరపడింది. పెడన పట్టణంలోనే 5,800 మంది నేత పనిలో నిమగ్నమై ఉన్నారు. పెడనలో నూలుతో మెత్తటి వస్త్రాలు తయారు చేస్తారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న చేనేత సహకార సొసైటీలు 7 ఉంటే, కృష్ణా జిల్లాలో 37 చేనేత సహకార సొసైటీలు ఉన్నట్లు సమాచారం. మచిలీపట్నం, పెడన, కప్పల దొడ్డి, ఆకులమన్నాడు, పోలవరం, రాయవరం, మల్లవోలు, చిన్నాపురం, చల్లపల్లి, శివరామదుర్గాపురం, పురిటిగడ్డ, ఘంటసాల, కాజా, గన్నవరం, ముస్తాబాద్, గుడివాడ, కనిమెర్ల, ఉప్పులూరు తదితర ప్రాంతాల‌్లో ప్రజలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
పథకం అర్హత..
ఈ పథకం కింద, దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలి. దరఖాస్తుదారుడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా వృత్తి పరంగా నేత అయి ఉండాలి. ఈ పథకం కింద, దరఖాస్తుదారు చేనేత సంఘంలో నమోదు చేసుకోవాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. మగ్గాలు ఎన్ని ఉన్నా ఒక కుటుంబంలో ఒకరికే ప్రయోజనం అందుతుంది.