AP CM Chandrababu News | అమ‌రావ‌తి: భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేరాల నియంత్ర‌ణ‌కు డ్రోన్లను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం స‌చివాల‌యంలో బెంగ‌ళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మ‌ల్టీ ప‌ర్ప‌స్ డ్రోన్ల డెమోని సీఎం ముందు ప్ర‌ద‌ర్శించింది.  ట్రాఫిక్ ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎన్ని వాహ‌నాలున్నాయి, అక్క‌డ తీసుకోవాల‌న్సిన చ‌ర్య‌లు ఏంటీ, భ‌ద్ర‌త‌కు సంబంధించి ఆయా మార్గాల్లో ఉన్న లోటుపాట్ల‌ను ఈ డ్రోన్ల‌ను రియ‌ల్ టైమ్ లో అంచ‌నావేసి చేర‌వేస్తాయని ఆ సంస్థ నిర్వాహ‌కులు తెలిపారు.


ట్రాఫిక్ నియంత్రకు చర్యలు


జ‌న‌ం ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రోన్ల ద్వారానే పబ్లిక్ అనౌన్స్‌మెంటు కూడా చేసి ర‌ద్దీని నియంత్రించవ‌చ్చ‌ని తెలిపారు.  ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో ర‌వాణ స‌దుపాయాలు లేని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు డ్రోన్ల ద్వారా మందులు చేర‌వేయాల‌న్నారు. పంచాయ‌తీలు, మున్సిపాల్టీలో డ్రోన్ల వినియోగం పెంచి ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ‌వ‌డానికి, దోమ‌ల నియంత్ర‌ణ‌కు మందుల పిచికారికి పెద్ద ఎత్తున ఉప‌యోగించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.




డ్రోన్ వినియోగం వ‌ల్ల ఎన్నో ప్రయోజనాలు


అడ‌వుల్లో కార్చిచ్చు లాంటి ప్ర‌మాదాల‌ను డ్రోన్ల ద్వారా ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  డ్రోన్ వినియోగం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జ‌ల్లో కూడా అవ‌గాహ‌న పెంచాల‌న్నారు. ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌ల్లో డ్రోన్ల వినియోగం విస్తృత‌ప‌ర‌చాల‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో పుర‌పాల‌క‌శాఖ మంత్రి పి. నారాయ‌ణ‌,  మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంట‌ర్‌ప్రైజెస్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌, సీఎం  కార్య‌ద‌ర్శి పీఎస్ ప్ర‌ద్యుమ్న‌, పెట్టుబ‌డులు మౌలిక‌స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్‌, ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె. దినేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Also Read: YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్