Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేసిన పవన్ - ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా
Pawan Kalyan: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జరిగిన నష్టంపపై అంచనాలు సిద్ధమవుతున్నాయని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

Pawan Kalyan: మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలు చాలా తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుతం నష్ట నివారణ అంచనాల్లో అధికారులు తలమునకలై ఉన్నారు. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నారు.

జరిగిన విపత్తు గురించి తెలుసుకుని రైతులకు భరోసా ఇచ్చేందుకు అధికార యంత్రాంగంతోపాటు నేతలంతా పొలం బాట పడుతున్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.
తుపాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో వరి పంటలు భారీగా నష్టపోయాయి. ఈ నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఈ ఉదయం అవనిగడ్డ నియోజకవర్గానికి చేరుకున్నారు. కొడూరు మండలంలో తుపాన్ ప్రభావంతో ధ్వంసమైన పంటలను పరిశీలించిన పవన్ నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లి వారితో మాట్లాడారు.

రైతుల నష్టాలపై వివరాలు తెలుసుకుంటూ, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, పరిష్కార మార్గాలు గురించి చర్చించారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల పక్షాన నిలుస్తుందని పవన్ భరోసా ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనలో స్థానిక రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యటన ద్వారా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూసిన రైతులు, పర్యటన అనంతరం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“అధికారులు, స్థానిక నేతలు రోడ్డు పక్కనే ఉన్న కొద్దిపాటి వరి పొలాలు మాత్రమే చూపించారు. ఒకే ఒక్క రైతు కుటుంబంతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇలా చేస్తే మండలమంతా ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఎలా తెలుసుకుంటారు? రైతుల ఓట్లు తప్ప మరేమీ వీరికి ముఖ్యం కాదు,” అని అన్నారు.

“ఉప ముఖ్యమంత్రి కోడూరు మండల కేంద్రానికే రాలేదు. సముద్రతీరానికి ఆనుకుని వేల ఎకరాల భూములు ప్రతీ ఏటా వరదలతో మునుగుతున్నాయి. కానీ ఆ సమస్యపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు,” అని పేర్కొన్నారు.

అదేవిధంగా పళకాయతిప్ప స్లూయిస్ అవుట్‌ఫాల్ శిథిలావస్థపై ఎవరూ దృష్టి సారించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “రైతుల కోసం చేస్తున్నామని నాయకులు చెబుతున్నా, నేలమీద మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు,” అని అన్నారు.

“ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కంటే రైతుల పట్ల కాస్త శ్రద్ధ చూపడం అవసరం. పంటలను కాపాడుకునేందుకు పోరాడుతున్న మేము మహిళల కష్టాలు ఎవరికీ కనిపించడంలేదు,” అని అన్నారు.





















