Vijayawada : అగ్రిగోల్డ్ భూముల స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఉదయం నుంచి వైసీపీ లీడర్, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ ఆయన కుమారుడిని అరెస్టు చేసింది. జోగి రమేష్ కుమారుడు ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించారని... మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పి అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం ఐదు గంటలకు ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కుట్రలో ఆయన పాత్ర ఉన్నట్టు నిర్దారించిన అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం గొల్లపూడి ఏసీబీ ఆఫీస్‌కు తరలించారు. ఈ కేసులో ఏ1గా జోగి రమేష్ బాబాయి ఉన్నారు.
ఇదంతా కక్షపూరితంగా సాగుతోందని జోగిరమేష్, తనయుడు జోగి రాజీవ్ ఆరోపించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా తమను ఇందులో ఇరికించిందని విమర్శించారు. కచ్చితంగా న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామని రాజీవ్ చెప్పారు. తన తండ్రిపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తున్నారని అన్నారు.
కుమారుడి అరెస్టుపై జోగి రమేష్ మాట్లాడుతూ... ఏమీ తెలియని తన కుమారుడిని అధికారులు అనవసరంగా అరెస్టు చేశారని విమర్శించారు జైల్లో పెట్టాలనుకుంటే తనను పెట్టాలని అమాయకుడైన తన కుమారుడిని పెట్టడమేంటని ప్రశ్నించారు. తాను బలహీన వర్గాల నుంచి ఎదిగిన నాయుకుడినని తన కుంటుంబంపై ప్రభుత్వం కక్షసాంధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
వివాదం ఏంటీ?
ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నం.69/2, రీసర్వే నం.87లో అగ్రిగోల్డ్ భూములను ఏపీ సీఐడీ ఎప్పుడో స్వాధీనం చేసుకుంది. ప్లాట్ల రూపంలో ఉన్న సుమారు 2,300 గజాల భూమిని సీజ్ చేసింది. ఇలా వివాదంలో ఉన్న భూములపై కన్నేసిన జోగి ఫ్యామిలీ అప్పనంగా కాజేసింది. జోగి రమేష్ బాబాయ్ అయిన వెంకటేశ్వ రావు, జోగి కుమారుడు రాజీవ్ కలసి నొక్కేశారు. ఒకరి పేరు మీద 1,086 గజాలు, మరొకరి పేరు మీద 1,074 గజాలు రాయించుకున్నారు.
ఇది డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తే సమస్య అవుతుందని గ్రహించిన జోగీ కుటుంబం... పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించినట్టు తెలిపారు. వాళ్ల వద్దే జోగి కుటుంబం కొన్నట్టు పత్రాలు సృష్టించారు.