బెజవాడ దుర్గమ్మ ఆలయానికి ట్రస్ట్ బోర్డ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పదిహేను మంది కమిటి సభ్యులను నియమిస్తూ జీవోను జారీ చేసింది.
బెజవాడ దుర్గమ్మ ఆలయానికి నూతన ట్రస్ట్ బోర్డ్ ను నియామకం జరిగింది. కమిటి నియమిస్తూ ప్రభుత్వం 111 జీవోను విడుదల చేసింది. బోర్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రెండు సంవత్సరాలపాటు పదవిలో ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మొత్తం పదిహేను మంది సభ్యులతో దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్న వ్యక్తి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా కమిటిలో ఉంటారని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది.
గత దసరా ఉత్సవాలకు ముందు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ పదవి కాలం ముగింది. అయితే అప్పటి నుంచి నూతన కమిటి నియామకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు అధికార పార్టీకి చెందిన నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.
కులాల వారీగా ప్రాధాన్యత
గతంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన పైలా సొమినాయుడును నియమించారు. ఇప్పుడు కూడా పూర్తిగా అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వటంతోపాటుగా, కులాల వారీగా సభ్యుల నియామకం జరిగిందనే ప్రచారం జరుగుతుంది. ఈసారి కూడా ఛైర్మన్ పదవిలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించారు. అంతేకాదు గతంలో పని చేసిన ఛైర్మన్ కూడా విజయవాడకు చెందిన వ్యక్తి కాగా ఇప్పుడు కూడా విజయవాడకు చెందిన వ్యక్తికే ఛైర్మన్ పదవిని కేటాయించారు. బీసీ వర్గానికి చెందిన కర్నాటి రాంబాబు ఛైర్మన్‌గా ప్రచారం జరుగతుంది.
ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం రాంబాబును సభ్యుడిగానే ప్రభుత్వం పేర్కొంది. కమిటి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఛైర్మన్‌ని ఎన్నుకొని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. పదిహేను మంది గల కమిటిలో పూర్తి సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు జరిగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా మాజీ మంత్రి మార్క్
దేవాదాయ శాఖలో మాజీ మంత్రి వెలంపల్లి మార్క్ ఇప్పటికి కంటిన్యూ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా విడుదలైన దుర్గగుడి పాలక మండలి జాబితా విషయంలో కూడా ఈ విషయం మరోసారి స్పష్టం అయ్యిందని పార్టీలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుతం దేవదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. అయితే దుర్గగుడి పాలక మండలి సభ్యుల నియామకంలో ప్రస్తుత మంత్రి జోక్యం లేకుండానే సభ్యుల నియామకం జరిగిందని కూడా చర్చ మొదలైంది.
దుర్గగుడి ఛైర్మన్ పదవిని విజయవాడకు చెందిన వ్యక్తికి రెండోసారి ఇవ్వటం చర్చకు దారి తీసింది. అది కూడా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే మరోసారి ఛైర్మన్ గిరిని అప్పగించటంపై పార్టీ నేతలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఛైర్మన్ పదవిని అమ్మవారి భక్తులు ఎక్కువగా వచ్చే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని గతంలో కూడా చాలా డిమాండ్లు వచ్చాయి. అయినా మరోసారి కూడా విజయవాడకు చెందిన వ్యక్తికే ఛైర్మన్ పదవిని కేటాయిచటంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.