9ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయవాడలోని కోర్టు కాంప్లెక్స్ పనులు ఎట్టకేలకు పూర్తై... సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగణంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 9 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈనెల 20న సీజే చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయ కోవిదులు హజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
2013లోనే శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావటానికి 9సంవత్సరాలు పట్టింది. చాలాకాలం నత్తనడకన పనులు సాగగా... మధ్యలో కరోనా కారణంగా రెండున్నర సంవత్సరాలకు పైగా నిర్మాణం ఆగిపోయింది. ఆ తర్వాత కూడా బిల్లుల చెల్లింపులు ఆలస్యం అయినందువల్ల పనులు ముందుకు సాగలేదు. పలువురు న్యాయవాదులు హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయాల్సి వచ్చింది. తర్వాత న్యాయస్దానం ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ఎట్టకేలకు 3.70ఎకరాల్లో 9 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది. జిల్లాలోని 29కోర్టులు ఒకేచోటకు చేరుతున్నందున కక్షిదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జస్టిస్ రమణకు డాక్టరేట్
సీజేఐ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈనెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఆయనకు డాక్టరేట్ అందజేస్తామని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉప కులపతి ఆచార్య పి.రాజశేఖర్ వెల్లడించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన రమణను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఆయనకు వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించామని, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని, ఆ ప్రయత్నం ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వీసీ అన్నారు. విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసించిన మొదటి బ్యాచ్ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం సముచితమని ఆయన పేర్కొన్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్ హోదాలో గవర్నర్ హాజరు కానున్నారు.