Rythu Bharosa Centres: ఏపీలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతం అంటూ కొనియాడారు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఒవెన్. విజయవాడలోని ఓ రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గుర్తించడం సంతోషించదగ్గ పరిణామం అన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఇప్పటికైనా విపక్షాలు రైతు భరోసా కేంద్రాలపై విమర్శలు మానాలన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ లో బ్రిటిష్ హై కమిషనర్ కార్యాలయం ఉంది. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా గారెత్ వైన్ ఒవెన్ వ్యవహరిస్తున్నారు. ఆయన విజయవాడలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. రైతులు, సిబ్బందితో ముచ్చటించారు. అక్కడ జరిగే కార్యకలాపాలు పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికారతకు, రైతుల జీవనోపాధి మెరుగు పరచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి, రైతు భరోసా కేంద్రాల ద్వారా చేస్తున్న కృషిని, అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవల గురించి వివరించారు.
రైతు భరోసా కేంద్రాలకు ఇదే తన తొలి సందర్శన అని, రైతుల ఉపాధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం బాగుందని అన్నారు. వారి ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. దీన్ని చూసి తానెంతో సంతోషపడ్డానని, వాటిపట్ల ఆకర్షితుడిని అయ్యానన్నారు.
స్పందించిన ప్రభుత్వం..
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ రైతు భరోసా కేంద్రాలను సందర్శించడంతోపాటు, వాటి పనితీరుపై ఆయన ట్వీట్ చేయడంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆయన ప్రశంసలను స్వాగతించారు. రైతు భరోసా కేంద్రాలపై ఆయన స్పందన.. ఏపీలోని ప్రతిపక్షాల అపోహలను కూడా తొలగించాలన్నారు.
రైతు భరోసా కేంద్రాలపై టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రైతు భక్షక కేంద్రాలంటూ వాటిని తూలనాడుతోంది. ఈ విషయంలో చాలా సార్లు, టీడీపీకి గట్టిగా కౌంటర్లు ఇచ్చారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగాలను వివరించారు. పంట మొదలు పెట్టినప్పటినుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అందుబాటులో ఉంటాయని, వారికి ఆర్థికంగా భరోసా ఇస్తాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కూడా రైతు భరోసా కేంద్రాలపై ప్రజల్లోకి పాజిటివ్ ప్రచారాన్నీ తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తోంది. అనుకోకుండా ఇప్పుడు ప్రభుత్వానికి బ్రిటిష్ హై కమిషనర్ ట్వీట్ వరంలా మారింది.
బ్రిటిష్ హై కమిషనర్ స్వయంగా రైతు భరోసా కేంద్రాలను సందర్శించడం అక్కడ జరుగుతున్న పనుల్ని మెచ్చుకోవడంతో ప్రభుత్వం ఆ ట్వీట్ ని మరో ప్రచారాస్త్రంగా మార్చుకుంది. రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్న పనుల్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని, ఇతర రాష్ట్రాల అధికారులు కూడా ఏపీకి వచ్చి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు సందర్శిస్తున్నారన, ఇప్పుడు ఏకంగా బ్రిటిష్ హై కమిషనర్ స్వయంగా రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి ప్రశంసించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇకనైనా ప్రతిపక్షాలు విమర్శలు మానాలని అంటున్నారు మంత్రి కాకాణి.