YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి బయటకు వచ్చేసిన విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు దూరం అంటున్నారుకానీ ఆయన తరచూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన జగన్ కోటరీపై విమర్శలు చేశారు. జగన్ పేరు పెట్టకుండా.. గతంలో తాను చేసిన కోటరీ విమర్శలకు కొనసాగింపుగా సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. 


రాజుల కథ చెప్పిన విజయసాయిరెడ్డి       


పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని.. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేదన్నారు.   దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదన్నారు.  కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడని..  కోటరీ మీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడన్నారు.  కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదని చెప్పాడు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదేనన్నారు.        


ఇటీవలే కోటరీపై విమర్శలు


ఇటీవల సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి తాను వైసీపీకి జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే దూరమయ్యానని ప్రకటించారు.  మూడున్నరేళ్లలో అవమానాలు ఎదుర్కొని తాను దిగిన ప్రతి మెట్టులోను చాలామంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని చెప్పుకొచ్చారు. చుట్టూ ఉండే కోటరీ నుంచి బయటపడినప్పుడే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని, ఇంతకన్నా తాను చెప్పగలిగిందేమీ లేదన్నారు. బయటినుంచి వెళ్లే సమాచారం తనకు అనుకూలంగా ఉంటున్నప్పుడు, ఆర్థికంగా, రాజకీయంగా తనకు లాభం ఉందనుకున్న వారిని మాత్రమే జగన్‌ వద్దకు కోటరీ పంపుతుంది.   నాయకుడు చెప్పుడు మాటలను నమ్మకూడదు. దానివల్ల నాయకుడితోపాటు పార్టీ, ప్రజలు కూడా నష్టపోతారు. వైసీపీలో ప్రస్తుతం అదే జరుగుతోంది.’’ అని విజయసాయి అప్పుడు చెప్పారు.  


ముందు ముందు మరింతగా టార్గెట్ చేస్తారా ?                 


జగన్‌ మనస్సులో తనకు స్థానం లేదని తెలిసినప్పుడు మనస్సు విరిగిపోయిందని, ఇక వైసీపీలో కొనసాగాల్సిన అవసరం లేదని జగన్‌కు చెప్పి వచ్చేశానన్నారు. చుట్టూ ఉన్న వారి మాటలు వినవద్దని, ప్రజలకు భవిష్యత్తులో ఎంతో సేవ చేయాలని లండన్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లో జగన్‌కు చెప్పానన్నారు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఘర్‌వాపసీ తనకు వర్తించదని, ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని తెలిపారు. అయితే ఇప్పుడు మరోసారి కోటరీ గురించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ముందు ముందు ఆయన వైసీపీని  మరింతగా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.