Vijayasa Reddy did not attend the SIT hearing in the liquor scam: ఆంధ్రా లిక్కర్ స్కాంలో విచారణకు సీఐడీ ఇచ్చిన నోటీసులను  విజయసాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్మరాలు ఉన్నాయని తాను రాలేనని ఆయన సిట్ అధికారులకు సమాచారం పంపారు. తనకు కుదిరనప్పుడు వస్తానని.. వచ్చే ముందు సమాచారం ఇస్తానన్నారు. తాను రాలేనన్న సమాచారాన్ని విజయసాయిరెడ్డి శుక్రవారమే సిట్ అధికారులకు ఇచ్చారు. కానీ సిట్ అధికారులు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం రాలేదు. దాంతో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. 

విజయసాయిరెడ్డిని SIT మొదట సాక్షిగా 2025 ఏప్రిల్ 18న విచారణకు పిలిచింది. అప్పుడు ఆయన సిట్ ముందు హాజరయ్యారు.   అయితే తర్వాత ఆయనను A-5 గా  చేర్చింది. అప్పటి విచారణలో   మద్యం విధానంపై చర్చించిన సమావేశాలు,  ముడుపులు , నాన్-డ్యూటీ పేడ్ లిక్కర్ (NDPL) విక్రయాలు,   కొత్త డిస్టిలరీ కంపెనీల గురించి ఆయనను ప్రశ్నించారు.  ఈ కుంభకోణంలో 2019-2024 మధ్య రూ. 3,200 కోట్ల నుండి రూ. 4,000 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు YSRCP నాయకులు డిస్టిలరీ కంపెనీలతో కుమ్మక్కై, కొత్త మద్యం బ్రాండ్లను ప్రోత్సహించి, ముడుపుల  రూపంలో భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ కేసులో ఏ వన్ గా ఉన్నారు.  ప్రతి మద్యం తయారీ కంపెనీ నుండి రూ. 50-60 కోట్ల ముడుపులు సేకరించినట్లు ఒప్పుకున్నాడని, ఈ నిధులను విజయసాయిరెడ్డితో సహా పలువురు కీలక వ్యక్తులకు హవాలా మార్గాల ద్వారా పంపిణీ చేసినట్లు SIT  చెబుతోంది.   విజయసాయిరెడ్డి హైదరాబాద్ మరియు తాడేపల్లిలోని తన నివాసాల్లో మద్యం విధానంపై జరిగిన మొదటి రెండు సమావేశాలకు హాజరైనట్లు విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారు. అలాగే, రూ. 100 కోట్ల రుణం ఏర్పాటు చేయడంలో సహాయం చేసినట్లు కూడా ఆయన అంగీకరించారు                                                  విజయసాయిరెడ్డి తాను ఈ కుంభకోణంలో ఒక విజిల్‌బ్లోయర్ గా వ్యవహరిస్తున్నానని, తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అంటున్నారు.  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఈ కుంభకోణం   ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు.  కసిరెడ్డిని పార్టీలో ప్రోత్సహించినప్పటికీ, అతని నేరస్థ మనస్తత్వం గురించి తనకు తెలియదని, కసిరెడ్డి తనను మోసం చేశాడని ఆయన చెప్పారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఈ కేసులో PMLA కింద సమాంతర దర్యాప్తు చేస్తోంది.

విజయసాయిరెడ్డి 2025 జనవరిలో YSRCP నుండి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వం నుండి కూడా వైదొలిగారు. ఆయన తన రాజకీయ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. తాజాగా ఆయన కర్మసిద్ధాంతం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో..ఆయన రాజకీయ పునరాగమనంపై చర్చ జరుగుతోంది.