అమరావతి: ఎరువుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ బృందాలు విస్తృతంగా దాడులు నిర్వహించాయి. ఇటీవల జరిగిన తనిఖీల్లో భారీగా అక్రమంగా నిల్వ చేసిన ఎరువులు బయటపడ్డాయి. కొందరు డీలర్లు బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి, రైతులను మోసం చేస్తూ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని దాడులలో వెల్లడైంది.
విజిలెన్స్ దాడులు.. 934 మెట్రిక్ టన్నుల ఎరువు స్వాధీనంఆగస్ట్ 23 నుండి ఆగస్ట్ 31 వరకు మొత్తం 286 విజిలెన్స్ బృందాలు 598 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీలలో రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులు అక్రమంగా విక్రయించబడుతున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై 67 కేసులు నమోదు చేశారు. అలాగే రూ.4.30 కోట్ల విలువైన 1,911 మెట్రిక్ టన్నుల ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, వాటి అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇందుకు సంబంధించి మరో 124 కేసులు నమోదు చేశారు. ఎరువుల నిబంధనలు అతిక్రమించిన మరో 8 దుకాణ యజమానులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం మీద 2,845 మెట్రిక్ టన్నుల ఎరువులు స్వాధీనం చేయబడగా, మొత్తం 191 కేసులు నమోదయ్యాయి.
సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది కలిగించే డీలర్లు, ఎరువుల దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎరువులు, యూరియా కొరత రానీయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దాడుల వివరాలు:
మొత్తం తనిఖీలు: 286 విజిలెన్స్ బృందాలు
తనిఖీలకు లోనైన దుకాణాలు: 598
సీజ్ చేసిన ఎరువులు:
₹1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నులు (అక్రమ విక్రయాలపై) ₹4.30 కోట్ల విలువైన 1,911 మెట్రిక్ టన్నులు (అక్రమ నిల్వలపై) నమోదైన కేసులు: 191 క్రిమినల్ కేసులు: 8 దుకాణ యజమానులపై