Vyuham Movie Controversy :  చంద్రబాబు కుటుంబసభ్యులను కించ పరుస్తూ సినిమాలు తీయిస్తున్నారని సీఎం జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ మేరకు బహింరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడిని మీ అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించకుండా ఉండేందుకు మానసికంగా క్రుంగదీయాలనే దుర్భుద్ధితో మీ పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుడి ఇంటిలోని మహిళలను సైతం శాసనసభ సాక్షిగా కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా మీరు మౌనం వీడలేదు. అంటే, మీకు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే సదుద్దేశం లేదు. మీకు మీ అధికారాన్ని నిలబెట్టుకోవడం తప్ప వేరే లక్ష్యాలేవీ లేవని  తాను భావిస్తున్నానని లేఖలో తెలిపారు. 


ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘వ్యూహం’ అనే సినిమా గురించి రకరకాల చర్చలు పుంఖానుపుంకాలుగా కొనసాగుతున్నాయి. ఈ ‘వ్యూహం’ అనే సినిమా ప్రత్యేకంగా ఏపీలోని ప్రతిపక్ష నాయకుడిని, ఆయన కుటుంబ సభ్యులను, ఆయన పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. ప్రతిపక్షాలను మానసికంగా కృంగదీసి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? ఇదే మీ అభిమతమా? రాజకీయ వ్యూహమంటే ప్రతిపక్షాలను కించపరిచే సినిమాల ద్వారా వారి ఆత్మగౌరవాలపై దెబ్బకొట్టడమేనా? మీ రాజకీయ వ్యూహాన్ని తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా.. సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు కొన్ని విషయాలను గుర్తుచేయాలనేదే తన ఉద్దేశమన్నారు. 


‘వ్యూహం’ సినిమాలో ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మేము కూడా వేరొక సినిమా తీసి మీపై, మీ కుటుంబ సభ్యులపై(మహిళలతో సహా), మీ పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలు, వారి ఇళ్లలోని మహిళలపై విభిన్న పాత్రలను కల్పించి కించపరిస్తే మీరు సమర్థిస్తారా? 2019 ఎన్నికల ముందు మీ కుటుంబంలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన విషయాలపై ఇప్పటి వరకు సమాజానికి తెలిసిన, తెలియని విషయాలపై కొన్ని పాత్రలు రూపొందించి సినిమా తీస్తే మీరు నవ్వుతూ ఆ సినిమాను స్వాగతిస్తారా? మీరు కొన్ని కేసుల్లో అరెస్టయి జైలు జీవితం గడిపిన విధానాలను సైతం సినిమాల్లో వేర్వేరు పాత్రలు రూపొందించి మీ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టేలా మేం సినిమాలు తీస్తే మీరు ఆనందంగా స్వాగతిస్తారా? మీ తమ్ముడు అవినాష్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడానికి వస్తే కర్నూలు ఆసుపత్రిలోకి వారిని వెళ్లకుండా అడ్డుకున్న వైనాన్ని సైతం సినిమాగా తీసి చూపిస్తే మీరు అంగీకరిస్తారా? మీ తల్లి, చెల్లి మీ ఇంటిని, మిమ్మల్ని వదలి ఎందుకు వెళ్లిపోయారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యేలా కల్పిత పాత్రలతో సినిమాలు తీస్తే మీరు, మీ పార్టీ శ్రేణులు స్వాగతిస్తారా?  అని ప్రశ్నల వర్షం కురిపించారు. 


 కుటుంబం, కుటుంబ విలువలు, బంధాలు-అనుబంధాలు అంటే తెలియని ఓ పనికిమాలిన వ్యక్తి జేబులు నింపడానికి మీరు ఇంతలా కృషి చేయడం సబబా? ఇదే వ్యక్తి రానున్న రోజుల్లో మీపై ఇటువంటి సినిమాలు తీస్తే మీరు అతన్ని ప్రశంసిస్తారా? అభినందిస్తారా? వెనకుండి ప్రోత్సహిస్తారా?... టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత నాయకులు ముఖ్యమంత్రిగా చేసిన ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి జాబితాలో చేరిన మీరు, ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చేలా ప్రవర్తించడం సరైనదేనా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? మీరు ఎంచుకున్న వ్యూహం బెడిసికొట్టి మీ ఇంటిపైకి వస్తే మీ పరిస్థితి ఏమిటి? సమాజంలో తలెత్తుకు తిరగగలరా? ప్రజాక్షేత్రంలో మీ గౌరవ, మర్యాదలు నిలబడతాయని మీరు భావిస్తున్నారా? అధికారం నిలబెట్టుకోవాలంటే ప్రజలకు మంచి ఎలా చేయాలో ఆలోచించాలని సూచించారు.