వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం ముందు ముందు కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం రెండు రోజుల కిందట రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ అంటే విశాఖ స్టీల్స్‌ను కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టాటా స్టీల్స్ సీఈవో ప్రకటన చేయడమే. ఇప్పటి వరకూ తాము వైజాగ్ స్టీల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ఒక్క కంపెనీ కూడా ప్రకటన చేయలేదు. తొలి సారి అలాంటి ప్రకటన చేసింది టాటాస్టీల్స్ మాత్రమే.  భౌగోళికంగా దక్షిణాదిన.. తీర ప్రాంతం కావడం, నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తూండటం, 22 వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వంటి ప్లస్ పాయింట్లు ఆకట్టుకున్నట్లుగా టాటా స్టీల్ చెబుతోంది.


స్టీల్‌ప్లాంట్‌కు సమీపంలోనే గంగవరం ఓడరేవు ఉండటం ఓ అడ్వాంటేజ్. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిసరుకులను తెప్పించుకోవడం సులభతరమౌతుంది. అదే సమయంలో ఇక్కడ తయారైన స్టీల్‌ను ఎగుమతి చేయడానికీ ఈ పోర్ట్ ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని టాటా స్టీల్స్ సీఈవో వ్యక్తం చేస్తున్నారు. ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా ఒరిస్సాలోని నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను కూడా టేకోవర్ చేయాలని టాటా స్టీల్స్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి బిడ్లు దాఖలు చేస్తామని చెబుతున్నారు.  ఉద్యోగుల్లో నిరసనలు తగ్గించడానికి కేంద్రం ఆసంస్థతో ఇలా ప్రకటన చేయించిందని ఉద్యోగులు నమ్ముతున్నారు. టాటా సంస్థలపై ప్రజల్లో ప్రత్యమైన అభిమానం ఉంది. టాటా సంస్థలపై  ఉన్న పాజిటివిటీని ఉక్కు ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వాడుకుంటోందన్న అభిప్రాయంలో ఉద్యమకారులు ఉన్నారు. 


టాటాల చేతికి విశాఖ స్టీల్ వెళ్తే ప్రజలు కూడా వ్యతిరేకించరన్న అభిప్రాయంతో ఆ సంస్థతో ప్రకటనలు చేయిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. టాటా స్టీల్‌ ఇప్పుడు భారీ లాభాల్లో ఉంది. ఏడాది క్రితం సంస్థ రూ.1,615 కోట్ల నష్టాన్ని చవిచూసింది.  కానీ ఇప్పుడు రూ. ఏడు వేల కోట్ల లాభంలోకి వచ్చింది.విదేశాల్లోనూ టాటా స్టీల్‌కు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎగుమతులు కూడా ఎక్కువే. వ్యూహాత్మకంగా ఆ సంస్థ టాటా స్టీల్‌ను చేజిక్కించుకుంటే మరిన్ని అవకాశాలు పొందుతుంది.  


విశాఖ స్టీల్స్ అమ్మకం ప్రక్రియను కేంద్రం చురుగ్గా నిర్వహించాలనుకుంటోంది. గతంలో జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ల గడువును పొడిగించింది. అయితే ఇప్పటి వరకూ పోస్కో సంస్థకు కట్ట బెట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్న  అనుమానాలు ఉద్యోగులతో పాటు ప్రజల్లో ఉన్నాయి. అయితే టాటా సంస్థతాము టేకోవర్ చేస్తామని ముందుకు రావడం మాత్రం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఆందోళనల్లో కీలకమైన అంశంగా మారే అవకాశం ఉంది. నిజంగా స్టీల్ ప్లాంట్ టాటాలు కొంటే .. ఇప్పుడున్నంత వ్యతిరేకత రాకపోవచ్చన్న అంచనా నిపుణుల్లో ఉంది.