Krishna River Water | హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాని (Rayalaseema Lift Irrigation Scheme)కి కృష్ణా నది నీటిని తరలించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ఫిబ్రవరి 27 న నిర్వహించిన సమావేశంలో ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ రాయలసీమ ఎత్తిపోతల అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపించింది. ఈ విషయాలను ఈఏసి తాజాగా స్పష్టం చేసింది. 


తెలంగాణకు చెందిన శ్రీనివాస్ గవినోల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపై ఈఏసి చర్చించింది. పర్యావరణ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేయడానికి ముందు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదని ప్రమాణ పత్రము సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. రాయలసీమ ఎత్తిపోతల (Rayalaseema Lift Irrigation) ప్రాజెక్టు సంబంధిత పూర్తి ఆధారాలు, పునరుద్ధరణ విధానాలు, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఫోటోలు జతచేయాలని ఈఏసీ సూచించింది.
చట్ట ప్రకారం చర్యలు..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏవైనా అక్రమ నిర్మాణాలు జరిగినా, అవకతవకలు జరిగిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు పొందాలంటే ప్రాజెక్టు ప్రారంభ స్థితిపై మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీలు నీరు తరలించేలా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. తాగునీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. ఆ నీటిని పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి కాలువలో పోసి అటు నుంచి చెన్నైకి ఇతర పథకాలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు దాఖలు అయింది. 


తెలంగాణ సైతం ఈ కేసులో జోక్యం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో డీపీఆర్ కన్నా ఎక్కువ పనులు జరిగాయని, పర్యావరణ శాఖ అడ్మిషన్ లేకుండా పనులు జరుగుతున్నాయని ఎన్జీటీ ఆదేశాలతో ఏర్పాటైన కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ప్రాజెక్టు తెలుగు పర్మిషన్ అవసరం లేదని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం రెండో దశ పనుల అనుమతికి దరఖాస్తు చేసింది. ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలించిన పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది.


తెలంగాణ ప్రభుత్వ ఘనత అంటున్న మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ హయాంలో ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం కోట్లాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం ఏపీ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇది తమ ఘనత అని చెప్పుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయడం ద్వారా ఏపీకి అన్యాయంగా నీళ్లు వెళ్లకుండా కేంద్రం అనుమతి ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ప్రాజెక్టులో ఉల్లంఘటనలు జరిగాయని, ఇది కచ్చితంగా రాష్ట్ర రైతులకు ఊరట కలిగించే అంశం అన్నారు.