అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ లభించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ రూపొందించడానికి చర్యలు తీసుకోవాలని ఉపరితల రోడ్లు, రవాణాశాఖ అధికారులను హోం శాఖ ఆదేశించింది. దాంతో త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
రెండు నెలలకోసారి సమావేశం..
కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫిబ్రవరి 3న జరిగిన సమావేశానికి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆ సందర్భంగా చర్చించిన అంశాలలో తాజాగా పురోగతి లభించింది. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజనపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు, ఇతర పరిష్కారం కాని సమస్యలపై రెండు నెలలకోసారి సమావేశమై చర్చించాలని కేంద్రం ఇటీవల సూచించింది.
కేంద్రం తాజా నిర్ణయంతో అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ (Hyderabad Regional Ring Road) ఉత్తర భాగం అనుమతులు రానున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు కసరత్తు మొదలుపెట్టనున్నారు. కేంద్ర హోం శాఖ ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. విభజన చట్టంలోని లేని అంశాలలో సైతం పురోగతి లభించింది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు అనుమతినిస్తూ.. డీపీఆర్ కు చర్యలు తీసుకోవాలని రోడ్లు ఉపరితల రవాణాకు సంబంధించిన శాఖకు హోం శాఖ సూచించింది.
హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆదేశించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బై పాస్, విజయవాడ -హైదరాబాద్, హైదరాబాద్ -బెంగుళూరు హైవేల విస్తరణకు కేంద్రం తాజా నిర్ణయంతో అడుగులు పడుతున్నాయి.
అమరావతి నిర్మాణానికి ఇటీవల నిధులు విడుదల
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఇటీవల అమరావతికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. సీఆర్డీఏ విజ్ఞప్తి మేరకు అమరావతి పనులు ప్రారంభించడం కోసం 25 శాతం నిధులు రూ. 4285 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంక్ రుణాల తొలి విడతతో పాటు కేంద్రం ఇస్తామని చెప్పిన సాయంలో ఇరవై శాతం అంటే రూ. 750కోట్లను మంజూరు చేసింది.