Unemployed Andhra youth Kills Self In US : అమెరికా గడ్డపై తన భవిష్యత్తును వెతుక్కునేందుకు వెళ్లిన ఒక తెలుగు తేజం అర్థాంతరంగా తనువు చాలించింది. కర్నూలు జిల్లాకు చెందిన 26 ఏళ్ల ఇరగనబోయిన చందు , చికాగోలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నవారి కష్టాలను తీర్చి, ఇంటికి అండగా నిలబడాల్సిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఉన్నత చదువుల కోసం చేసిన అప్పులు, తీరని ఉద్యోగ కల ఆ యువకుడిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడమే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది.
కన్నవారి కష్టాన్ని చూసి తల్లడిల్లి..
చందు చికాగోలోని డిపాల్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కొడుకును విదేశాలకు పంపాడు. చదువు పూర్తయ్యాక కొద్ది వారాలుగా ఉద్యోగం కోసం చందు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆశించిన ఫలితం రాకపోవడం, ఇంటి వద్ద తండ్రి పడుతున్న కష్టం, పెరుగుతున్న అప్పులు అతడిని కలచివేశాయి. తన వల్ల కుటుంబానికి భారం పెరుగుతోందన్న ఆవేదనతోనే చందు ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.
అండగా నిలుస్తున్న ప్రవాస భారతీయులు
చందు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే దాదాపు 25,000 డాలర్లు అంటే సుమారు 20 లక్షలు ఖర్చు భరించడం ఆ కుటుంబానికి శక్తికి మించిన పని. దీంతో చికాగోలోని భారతీయ సమాజం చేయి కలిపింది. చందు మృతదేహాన్ని కర్నూలుకు తరలించడంతో పాటు, ఆ కుటుంబం చేసిన అప్పులను తీర్చేందుకు 1,20,000 డాలర్ల లక్ష్యంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 76,000 డాలర్లు అంటేరూ. 63 లక్షలకు పైగా విరాళాలు వచ్చాయి.
స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చే శారు. చందు మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇంటికి చేర్చాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.
చందు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లాడు. అందరికీ ఆపన్న హస్తం అందించే మంచి మనసున్న వ్యక్తి. కానీ విధి అతడిని ఇలా బలి తీసుకోవడం మా వల్ల కావడం లేదు అంటూ అతని స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
