TTD News: తిరుమల శ్రీవారి లడ్డూలను పక్కదోవ పట్టిస్తున్న ఇంటి దొంగల గుట్టు రట్టు అయ్యింది. బ్లాక్‌లో లడ్డూలను విక్రయిస్తున్న ఐదుగురు టీటీడీ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 17 లడ్డూ ట్రేలకు సంబంధించిన లడ్డూల విక్రయాల లెక్కలు తేలకపోవడంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఉద్యోగులపై నిఘా పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ఉద్యోగులకు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అక్రమ మార్గంలో లడ్డూలను పక్కదారి పట్టించి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. ఇలా ఎన్నో వ్యయ ప్రాయాసలకు ఓర్చి తిరుమలకు చేరుకున్న భక్తులు క్షణ కాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శనంతో జన్మధన్యం అయిందని పరవశించి పోతుంటారు. అయితే శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చేది శ్రీవారి లడ్డూ ప్రసాదానికే. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత డిమాండ్ ఉంటుందో అని.
ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని బంధు,మిత్రులకు పంచేందుకు భక్తులు తీసుకెళ్తుంటారు. భక్తులకు అడిగిన అన్ని లడ్డూలను అందించేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అయితే శ్రీవారి బూందీ పోటులో లడ్డూలను తయారు చేసిన అనంతరం ట్రేల ద్వారా లడ్డూలను... విక్రయశాలకు టీటీడీ సిబ్బంది తరలిస్తారు. అనంతరం లడ్డూ విక్రయశాలలో భక్తులకు అమ్ముతుంటారు.
లడ్డూ ట్రేలు మాయం చేస్తున్న ఐదుగురి అరెస్ట్
ఈ క్రమంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలని, అత్యాశకు పోయిన కొందరు సిబ్బంది బూందీపోటులో లడ్డూలు తయారు చేసిన తరువాత వాటిని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నాళ్లుగా గుట్టుగా అమ్ముకున్న ఇంటిదొంగలు ఎట్టకేలకు అధికారులకు దొరికిపోయారు.
గత కొంత కాలంగా బూందీ పోటులో లడ్డూ ట్రేలు తక్కువ రావడంతో బూందీపోటు పేష్కార్ కు అనుమానం వచ్చి నిఘా ఉంచాడు. కానీ ఎవరు లడ్డూలను పక్కదోవ పట్టిస్తున్నారో గుర్తించలేక పోయారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో లడ్డూ ట్రేలు షార్టేజ్ వస్తూనే ఉన్నాయి. చివరకు ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన పేష్కార్ శ్రీనివాసులు గత మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు.
పేష్కార్ ఫిర్యాదుతో గుట్టురట్టు చేసేందుకు రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పోటులో నుంచి లడ్డూ స్ట్రేలను బయటకు తీసుకుని వచ్చే వారిపై నిఘా పెట్టారు. దీంతో అక్రమార్కుల బండారు బయపడింది. ఇంటి దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వీరి వద్ద నుంచి సుమారు పదిహేను ట్రేల లడ్డూలు అంటే 750 లడ్డూలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియలో బూందీ పోటులో విధులు నిర్వర్తించే టీటీడీ శాశ్వత ఉద్యోగితో పాటుగా కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలింది.
గోప్యంగా ఉంచి విచారణ సాగిస్తున్న అధికారులు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు వీరితో పాటుగా మరి కొంతమంది టీటీడీ శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను విచారిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా బూందీపోటులో లడ్డూ ట్రేలను లడ్డూ విక్రయశాలకు తరలించే క్రమంలో చాకచక్యంగా ట్రేలను మాయం చేసి, లడ్డూలను అక్రమంగా విక్రయించేవారని టీటీడీ విజిలెన్స్ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తొంది. 17 ట్రేలు కాకుండా గత కొంత కాలంగా వేల సంఖ్యలో లడ్డూలను పక్కదారి పట్టించినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఈ మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగు చూడాల్సిన ఉంది. లడ్డూ ట్రేల మాయం ప్రక్రియలో టీటీడీ శాశ్వత ఉద్యోగితో పాటుగా, కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఉండడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది.