TTD board member Janga Krishnamurthy resigns: జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ మేరకు లేఖ రాశారు. అందులో తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు వివరించారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు.    తిరుమలలో శ్రీవారి సేవలో భాగం కావాలనుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి ప్రయత్నం చివరికి వివాదాస్పదమై పదవికే ఎసరు పెట్టింది. ఇటీవల టీటీడీ బోర్డు ఆయనకు కాటేజీ నిర్మాణానికి స్థలం కేటాయించింది. అయితే ఆయనకు వ్యక్తిగతంగా కాకుండా ఓ ట్రస్ట్ పేరు మీద కేటాయించారు.  సుమారు రెండు దశాబ్దాల క్రితం  2005లో  ప్రారంభమైన ఈ కాటేజీ నిర్మాణ ప్రయత్నం, నిబంధనల ఉల్లంఘన ఆరోపణల మధ్య ఆయన రాజీనామాకు దారితీసింది. బోర్డు సభ్యుడిగా ఉంటూనే, కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన స్వంత ట్రస్టుకు పాత ధరలకే కట్టబెట్టుకోవాలని చూడటం ఈ వివాదానికి ప్రధాన కేంద్రబిందువైంది.  తిరుమల నిబంధనల ప్రకారం, ఒకసారి వ్యక్తిగత పేరు మీద కేటాయించిన ప్లాట్‌ను ట్రస్టు పేరు మీదకు మార్చడం నిషిద్ధం. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జంగా కృష్ణమూర్తి తన వ్యక్తిగత దరఖాస్తును  ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్టు పేరిట మార్చాలని కోరగా టీటీడీ బోర్డు దానిని తోసిపుచ్చింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్లాట్‌ను ఆయన సూచించిన ట్రస్టుకు కేటాయిస్తూ బోర్డు తీర్మానం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం తిరుమలలో ఒక ప్లాట్ కేటాయించాలంటే భక్తుల నుంచి  దాదాపు 7 కోట్ల పైచిలుకు విరాళాలు వస్తాయి. కానీ, జంగా కృష్ణమూర్తికి కేవలం 1.1 కోట్ల రూపాయల పాత ధరకే ఆ స్థలాన్ని కేటాయించడంపై బోర్డు లోపల, బయట విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా ఆయనే భూముల కేటాయింపు చేసే  ఎస్టేట్ కమిటీ లో సభ్యుడిగా ఉండి, తనకే స్థలం కేటాయించుకోవడం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్'  కిందికి వస్తుందని విమర్శలు వచ్చాయి.

Continues below advertisement

నిజానికి తిరుమల అంతా కాంక్రీట్ జంగిల్ గా మారుతోందని కాటేజీల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదు.   ఈ వ్యవహారం సర్కారుకు మరియు టీటీడీ బోర్డుకు మచ్చ తెచ్చేలా ఉండటంతో, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన ప్రయత్నం స్వార్థం కోసం కాదని, భక్తుల కోసమేనని ఆయన చెప్పుకున్నప్పటికీ, టీటీడీ పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడంతో ఆయన వెనక్కి తగ్గక తప్పలేదని చెబుతున్నారు. 

జంగా కృష్ణమూర్తి   కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.  వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో 2004, 2009 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ బి.సి. విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే  వైసీపీ నాయకత్వంతో విభేదించి, 2024 ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి  తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో టీటీడీ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. కాటేజీ వివాదంతో రాజీనామా చేశారు.  

Continues below advertisement