జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు (నవంబరు 27) మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. దీనికోసం ఇప్పటికే గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.


హైదరాబాద్ లో చంద్రబాబు, లోకేష్


టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు నేడు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. తిరిగి సోమవారంనాడు ఏపీకి తిరిగి రానున్నారు. తెలంగాణ తెలుగు దేశానికి చెందిన కొందరు నేతలకు వారు ఆపాయింట్‌మెంట్ లు ఇచ్చిన దృష్ట్యా వారిని ఆదివారం నాడు కలవనున్నారు. అలాగే, నెల్లూరు నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో వారు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు ఏపీకి వెంటనే బయలుదేరే అవకాశం ఉంది.


ఏలూరులోనే బీజేపీ బీసీ సభ


ఆదివారం నాడు ఏలూరులో బీజేపీ బీసీ సదస్సు జరగనుంది. దీనికోసం పార్టీ కీలక నేతలంతా ఏలూరులో మకాం వేశారు. బీసీ సామాజిక చైతన్య సభ పేరిట జరిగే ఈ సదస్సు ఏర్పాట్లను  శనివారం నాడు పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం బీజేపీ, జనసేనలతోనే సాధ్యం అని అన్నారు. బీసీలను ఓట్ల కోసం మాత్రమే రాష్ట్రంలోని రెండు పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చారు కానీ వారికి ఒక కుర్చీ, ఒక బడ్జెట్, ఒక ఆఫీస్ అనేవి లేవని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల బీసీ సామాజిక చైతన్య సభలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపిన ఆయనఆంధ్ర ప్రదేశ్ లో బీసీ ఆధారిత ప్రభుత్వ ఏర్పాటు తో రాష్ట్ర అభివృద్ది సాధిస్తాం అని అన్నారు.


టీడీపీ నేతపై కారు దాడి ఘటన


నెల్లూరు టీడీపీ సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాస్ పై కారుతో దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే పార్టీ కీలక నేతలంతా దీనిపై ఖండనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాజకీయ వివాదాలు చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


నేటి మరిన్ని అంశాలు


నేడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఉండనున్నారు.


వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు డిమాండ్ తో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన