Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచన, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం ఎంతో అవసరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శిందుకు ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు నాయకుల నాయకత్వంలో బలంగా ముందుకెళ్లి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధిస్తామని ఆయన అన్నారు. 


వైసీపీ ముక్త ఏపీ లక్ష్యం
అతి త్వరలో రెండు పార్టీలు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్తాయని, వైసీపీ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని తెలిపారు. బటన్లు నొక్కే పద్ధతి కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు త్వరలోనే ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తాయని, ఇంటింటికి వెళ్లి వైసీపీ వైఫల్యాలను తెలియజెప్పడంతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. అంతకంటే ముందు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు.  


దేశంలోనే ఏకైక పార్టీ జనసేన 
దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా పార్టీ క్రియాశీలక సభ్యులను తన కుటుంబ సభ్యులుగా భావించి జనసేన పార్టీ అండగా ఉంటోందని నాదెండ్ల తెలిపారు. ప్రమాదవశాత్తు క్రియాశీలక సభ్యుడు మరణిస్తే పవన్ కళ్యాణ్ సంతకం చేసిన రూ.5 లక్షల చెక్కును అందజేసి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ రెండు రోజుల్లో  దాదాపు రూ.55 లక్షలు విలువ చేసే 11 చెక్కులను పార్టీ తరఫున క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు. అల్లపల్లివారిపాలెంలో బండారు వెంకట రాజు అనే జనసైనికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కు అందించినట్లు తెలిపారు. ఆయన ఇద్దరి కుమారుల చదువులను జిల్లా నాయకత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. 


కార్యకర్త కుటుంబానికి పరామర్శ 
ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు నాగిరెడ్డి సత్తిబాబు కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ బుధవారం పరామర్శించారు. సత్తిబాబు స్వగ్రామమైన కొత్తపేట నియోజవర్గం వానపల్లి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్తిబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సత్తిబాబు భార్య నాగిరెడ్డి ముత్యాలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేశారు. పిల్లల చదువుల బాధ్యతను పార్టీ చూస్తుందని భరోసా చెప్పారు.


ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, జిల్లా నాయకులు వేగుళ్ళ లీలాకృష్ణ, తుమ్మల బాబు, వరుపుల తమ్మయ్యబాబు, మర్రెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, పాటంశెట్టి సూర్యచంద్ర, బొంతు రాజేశ్వరావు, టీవీ రామారావు, సుంకర కృష్ణవేణి పాల్గొన్నారు.