వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఏడు జాబితాలో ప్రకటించిన అభ్యర్థులంతా సమన్వయకర్తలేనని, వారే వచ్చే ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు కాదని వై వి సుబ్బారెడ్డి మరోమారు స్పష్టం చేశారు.  వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఏడు జాబితాల్లో ప్రకటించిన వారు సమన్వయకర్తలేనని, వాళ్లు అభ్యర్థులు కారని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మేదరమెట్లలో ఆఖరి సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని, ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన వెల్లడించారు. తాజాగా వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టికెట్లు దక్కక పక్క పార్టీల వైపు చూస్తున్న నేతలను వైసీపీలో ఉండేలా చేసేందుకే సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా..? అన్న దానిపై ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఉన్న అభ్యర్థులతో పాటు కేడర్లను అయోమయం నెలకొంది. ఇప్పటివరకు ఏడు జాబితాలో ప్రకటించబడిన అభ్యర్థులు సీటు తమదే అనుకొని జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.  ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్న తమకు సీటు కేటాయించకుండా మరొకరికి స్వీట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన వారిలో నెలకొంది. 


కట్టడి చేసే వ్యూహంలో భాగమేనా..!


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు. టికెట్లు రావని తెలిస్తే మరింత మంది అభ్యర్థులు జంప్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని కట్టడం చేసేందుకే వైవి సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చేనెలలో నాలుగో సిద్ధం సభను వైసీపీ నిర్వహిస్తోంది. ఈ సభ అనంతరం పూర్తిస్థాయిలో అభ్యర్థులు జాబితాను వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని ఆ పార్టీలోని కీలక నాయకులు చెబుతున్నారు.